YS Jagan : సీఎం జగన్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
NQ Staff - January 30, 2023 / 06:44 PM IST

YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్ పోర్ట్ కు సాయంత్రం చేరుకున్నారు. ఆయన ఎక్కిన ప్రత్యేక విమానం టేకాఫ్ అయినా కొద్దిసేపటికే తిరిగి అదే గన్నవరం ఎయిర్ పోర్ట్ లో అత్యవసర లాండింగ్ అయింది.
ఈ ప్రత్యేక విమానం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి సాయంత్రం 5 గంటల 3 నిమిషాలకు టేకాఫ్ అవ్వగా కొన్ని నిమిషాలకే తిరిగి వచ్చింది. సాయంత్రం 5 గంటల 26 నిమిషములకు అత్యవసరంగా ల్యాండ్ అవడంతో వైకాపా శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్యల వల్లే అత్యవసర ల్యాండింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో తన ఢిల్లీ ప్రయాణాన్ని విరమించుకున్న సీఎం జగన్ గన్నవరం నుండి తాడేపల్లి లోని తన నివాసానికి ప్రయాణమయ్యారు.
సీఎం జగన్ రేపు ఢిల్లీలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. ఆ సమావేశంలో పలు దేశానికి సంబంధించిన దౌత్యవేత్తలు హాజరు కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి జగన్ మరియు ఉన్నతాధికారులు ఆ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది.
ఇప్పటికే అధికారులు మరో ప్రత్యేక విమానంను సీఎం జగన్ ఢిల్లీ పర్యటన నిమిత్తం ఏర్పాటు చేస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ప్రత్యేక విమానం లో ఢిల్లీకి సీఎం జగన్ వెళ్లబోతున్నారు.