Press Academy: తెలంగాణ ప్రెస్ అకాడమీ నిర్ణయం మంచిదే. కానీ..

Press Academy: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సాయం చేయాలని ప్రెస్ అకాడమీ తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ఇవాళ సోమవారం సాయంత్రం ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. కొత్తగా కొవిడ్-19 వైరస్ సోకిన 200 మంది పాత్రికేయులను అర్జెంటుగా ఆదుకుంటామని తెలిపారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబీకులు మే నెల 10 లోపు తెలంగాణ ప్రెస్ అకాడమీ ఆఫీసుకు అప్లికేషన్లు పంపాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఇచ్చిన మరణ ధృవీకరణ పత్రం, అక్రిడేషన్ కార్డు, కరోనా పాజిటివ్ రిపోర్టుతోపాటు ఆయా జిల్లాల పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్లు కూడా కన్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుందని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు.

ఒక్క నిమిషం అధ్యక్షా..

సర్కారు సాయం పొందాలంటే ఎవరైనా, ఏ పథకం కిందైనా కొన్ని నియమ, నిబంధనలను పాటించాల్సిందే. తప్పదు. అయితే అందులో ‘అక్రిడేషన్ కార్డు’ (పాత్రికేయులకు ప్రభుత్వ గుర్తింపు కార్డు) అనేది కొన్ని వేల మంది జర్నలిస్టులకు ఒక బ్రహ్మ పదార్థం లాంటిది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రభుత్వ పథకాలు బాగానే అమలవుతున్నాయి గానీ పాత్రికేయుల పరిస్థితే ధారుణాతిధారుణంగా ఉంది. అక్రిడేషన్ కార్డు ఉన్నోళ్లు వందలో పది మంది కూడా ఉండరు. అది లేకపోతే కరోనా సాయం రాదు. ఏదీ రాదు. అసలు గవర్నమెంట్ దృష్టిలో, లిస్టులో అతడు జర్నలిస్టే కాడు. ఇలా అక్రిడేషన్ కార్డులు లేనోళ్లు కూడా చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. అయినా వాళ్లను పట్టించుకునే నాథుడు లేడు. వందలో పది మందికి కూడా ప్రభుత్వ సాయం అందకపోతే ఏం ప్రయోజనం?.

ముందు అవి ఇవ్వండి..

తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్లకు రేషన్ కార్డు రావటం, జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు రావటం దాదాపు అసాధ్యంగా మారింది. పది పదిహేను సంవత్సరాలు పాత్రికేయ రంగంలో ఉన్నా యాజమాన్యాలు దేఖవు. సర్కారు విధానాలు కూడా అట్లే ఉన్నాయి. ప్రజలకు విలువైన సమాచారాన్ని చేరవేసే జర్నలిస్టులకే దిక్కు లేకపోవటం దయనీయం, దరిద్రం, దురదృష్టం. పాత్రికేయులకు ముందు అక్రిడేషన్ కార్డులు ఇవ్వండి మహాశయా. ఆ తర్వాత ఇవి ఇద్దురు గాని.

Advertisement