Eatala: సంచలన వార్త : మంత్రి ఈటల రాజీనామా?.. ‘నమస్తే’లో నమ్మలేని న్యూస్..

Eatala: ‘నమస్తే తెలంగాణ’ న్యూస్ పేపర్ గానీ.. వెబ్ సైట్ గానీ చూసేవారికి ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుసు. అధికార పార్టీ టీఆర్ఎస్ నేతల గురించి గానీ, ప్రజా ప్రతినిధుల గురించి గానీ ఒక్క వ్యతిరేక వార్త కూడా వాటిలో రావు. ఎందుకంటే దాన్ని పింక్ మీడియా అని, ప్రభుత్వ మీడియా అని అంటుంటారు. ఇది 99 శాతం పక్కా. కానీ ఇవాళ ఒక ఆశ్చర్యకరమైన, నమ్మలేని న్యూస్ ‘నమస్తే తెలంగాణ’ వెబ్ సైట్ లో కనిపించింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా బాగోతానికి పాల్పడ్డారని, అది వెలుగులోకి వచ్చిందనేది ఆ న్యూస్ సారాంశం.

ఎక్కడ? ఏమిటి?..

‘నమస్తే తెలంగాణ’ వెబ్ సైట్ లో ఈరోజు పబ్లిష్ అయిన ఈ వార్త ప్రకారం.. మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తన సతీమణి జమున పేరిట ఉన్న హ్యాచరీస్ కోసం ఆయన పేదలను, ప్రభుత్వ అధికారులను బెదిరించి మరీ వందల ఎకరాలను ఆక్రమించినట్లుగా సమాచారం. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో ఈటల ఈ భూఆక్రమణలకు పాల్పడ్డారు. అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో 100 ఎకరాలు భూకబ్జా చేశారు. 130/5, 130/10, 64/6 సర్వే నంబర్లలో గల భూమిని మంత్రి కబ్జా చేశారు. రిజిస్ట్రేషన్ కుదరదన్నా మంత్రి ఈటల ఆఫీసర్లపై ఒత్తిడి తెచ్చి తన భార్య జమున, కొడుకు నితిన్ రెడ్డి పేరుతో అసైన్డ్ భూములను సైతం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బాధిత బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు మంత్రి భూకబ్జాపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మంత్రి ఈటల భూదాహాన్ని మెదక్ జిల్లా రిటైర్డ్ కలెక్టర్ ధర్మారెడ్డి వెలుగులోకి తెచ్చారు అని ‘నమస్తే తెలంగాణ’ రాసుకొచ్చింది.

పొగపెడుతున్నారా?..

ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కి, సీఎం కేసీఆర్ కి మధ్య చానాళ్లుగా పడట్లేదని వార్తలు వస్తున్నాయి. పార్టీ అధినేతపై ఈటల అసంతృప్తిగా ఉన్నారని, అందుకే అప్పుడప్పుడూ తేడాగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. మంత్రి కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా చేయటం ఈటలకు ఇష్టంలేదని, కాబట్టే ఆ మధ్య గులాబీ జెండాకు తామూ ఓనర్లమేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరిగింది. ఒక మంత్రిపైన ‘నమస్తే తెలంగాణ’ ఈరకమైన వార్త రాయటం అంటే ఇక ఆ మినిస్టర్ చాప్టర్ క్లోజ్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ వార్త రేప్పొద్దున అన్ని మీడియాల్లో వస్తే ప్రతిపక్షాలు గోలగోల చేస్తాయి. దీంతో ప్రభుత్వం ఆయన చేత రాజీనామా చేయించినా చేయిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సీఎం కేసీఆర్ సీరియస్ రియాక్షన్

మంత్రి ఈటల రాజేందర్ పట్ల వచ్చిన భూకబ్జాల ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. సమగ్ర విచారణ జరిపించాలంటూ విచారణకు ఆదేశించారు. దర్యాప్తు చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కి ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్‌ ద్వారా రిపోర్ట్‌ తెప్పించి ఇవ్వాలన్న సీఎం కేసీఆర్‌.. వాస్తవాలను నిగ్గు తేల్చాలని డీజీ పూర్ణచంద్రరావుకు స్పష్టం చేశారు. వెంటనే ప్రాథమిక నివేదిక అందజేయాలన్నారు.

Advertisement