Health: కలిసిరాని ‘ఆరోగ్యం’.. అప్పుడు రాజయ్య.. ఇప్పుడు ఈటల.. మధ్యలో లక్ష్మారెడ్డి..

Health: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ కలిసి రావట్లేదు. ఆ శాఖ బాధ్యతలను చూసినవాళ్లు మధ్యలోనే పదవి నుంచి వైదొలగాల్సి వస్తోంది. అయితే వాళ్లు మంచిగా పనిచేయలేకపోవటం వల్ల కాదు. వాళ్లపై వేర్వేరు ఆరోపణలు రావటం వల్ల. మొదట్లో ఈ శాఖతోపాటు ఉపముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించిన తాటికొండ రాజయ్య కేవలం ఏడాది కాలం పాటు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ని అడగకుండానే సొంత నిర్ణయం తీసుకున్నాడనే కోపంతో ఆయనపై వేటు పడిందని అప్పట్లో అన్నారు. ఒక తెలుగు సినిమా హీరోయిన్ తో బంజారాహిల్స్ లోని ఒక హోటల్ లో గడిపారనే ఆరోపణలు రావటం వల్ల తొలగించారని కూడా అన్నారు. ఏదో భూవివాదం తలెత్తిన కారణంగా రాజీనామా చేయించారని మరికొందరు అంటుంటారు. కారణం ఏదైనా రాజయ్యపై కేసీఆర్ కఠినమైన చర్య తీసుకున్నారు.

ప్రస్తుతం ఈటల

ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. టీఆర్ఎస్ రెండోసారి గెలిచినప్పుడు ఈయనకు వెంటనే మంత్రి పదవి దక్కలేదు. అప్పుడే ఈటలను పక్కన పెడతారేమో అనుకున్నారు. కానీ కాస్త ఆలస్యంగా కేబినెట్ లోకి తీసుకున్నారు. గతంలో ఆర్థిక మంత్రిగా చేసిన ఈయనకు రెండోసారి ముఖ్యమైన ఆరోగ్య శాఖనే ఇచ్చారు. కానీ.. కేటీఆర్ ని సీఎం చేస్తారనే వార్తల నేపథ్యంలో ఈటల కాస్త భిన్నంగా, అధిష్టానం అభీష్టానికి వ్యతిరేకంగా స్పందించారు. దీంతో సీఎం కేసీఆర్ కి, ఈయనకి మధ్య గ్యాప్ వచ్చింది.

మాటల్లోని అంతరార్థం ఏంటో?..

పార్టీ నిర్ణయాలతోపాటు ప్రభుత్వ పథకాలను కూడా తప్పుపడుతూ ఈటల రాజేందర్ అప్పుడప్పుడూ విభిన్నంగా మాట్లాడేవారు. ప్రస్తుతం అమలుచేస్తున్న రైతుబంధు, ఆసరా పింఛన్లు తదితర పథకాలతో పేదరికం పోదంటూ ఏదేదో అనేవారు. కులం ముఖ్యం కాదు.. డబ్బు ముఖ్యం కాదు.. పదవులు కూడా ముఖ్యం కాదు.. కేవలం మనిషిని మాత్రమే గుర్తుపెట్టుకుంటే చాలు అని చెప్పేవారు. దీంతో ఈటల రాజేందర్ గులాబీ పార్టీలో ఇబ్బందిపడుతున్నారని అర్థమవుతోంది. తాజాగా వచ్చిన భూకబ్జా ఆరోపణలతో ఆయన్ని సర్కారు నుంచి, పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు ప్లాన్ రెడీ అయిందని అంతా భావిస్తున్నారు.

మధ్యలో లక్ష్మారెడ్డి..

తాటికొండ రాజయ్య తర్వాత సి.లక్ష్మారెడ్డి ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. టీఆర్ఎస్ రెండోసారి గెలిచాక ఆయన్ని మళ్లీ కేబినెట్ లోకి తీసుకోలేదు. దీంతో లక్ష్మారెడ్డి అప్పుడప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. పార్టీకి పరోక్షంగా చెడ్డ పేరు తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రులుగా చేసినవాళ్లకు ఎందుకో రాజకీయ భవిష్యత్తు సరిగా ఉండట్లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Advertisement