3rd Wave: వచ్చే ఏడాది మార్చి వరకు థర్డ్ వేవ్ రాదు.. హెల్త్ డైరెక్టర్ వెల్లడి
Samsthi 2210 - September 13, 2021 / 09:44 PM IST

3rd Wave: కరోనా మూడోవేవ్ ముప్పు ఎంత ఉంది? ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇది. కొన్ని చోట్ల థర్డ్ వేవ్ మొదలైందని చెబుతుండగా, ఇటీవల కొన్ని రోజులుగా కొన్ని రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు పెరుగుతుండడం మళ్ళీ ఆందోళన కలిగిస్తోంది. కేరళ అలాగే, ఈశాన్య రాష్ట్రాలలో కొత్త కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముంబయి మేయర్ కూడా మూడో వేవ్ కరోనా ముంబయిని తాకినట్లు చెప్పారు.
అయితే కరోనా పూర్తిగా కంట్రోల్ లోనే ఉందని.. వచ్చే మార్చి వరకు థర్డ్ వేవ్ వచ్చే పరిస్థితి లేదని.. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. పిల్లలని తల్లిదండ్రులు స్కూలుకి పంపడానికి భయపడొద్దని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల మంది విద్యార్థులకు టెస్ట్ లు చేస్తే 57 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చిందన్నారు. 5 లక్షల మంది రెసిడెన్స్, హాస్టల్స్ లో చదువు కుంటున్నారు.. అవి కూడా స్టార్ట్ చేస్తున్నామని వివరించారు.
రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉన్నప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. 27 వేల పడకలకు ఆక్సిజన్ కల్పిస్తున్నామన్నారు. ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే అనే అనుమానంతో 3202 బెడ్స్ ను పిల్లల కోసం ఏర్పాటు చేశామన్నారు. కరోనా కంట్రోల్ కోసం 113 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. కరోనా లేదని మాస్క్ పెట్టుకోవడం మరచిపోవద్దని ఆయన అన్నారు.
ఐటీ కంపెనీలు కూడా ఓపెన్ చేయాలని ఆయన సూచించారు. ఐటీ కంపెనీల మీద చాలా రంగాలు ఆధారపడి ఉన్నాయని, లక్షలాది మందికి ఉపాధి దొరకాలన్నారు. జీహెచ్ఎంసీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామని.. 2 కోట్ల డోసులు ఇప్పటి వరకు ఇచ్చామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వివరించారు. మూడు వారాల్లో 8.75 లక్షల మందికి మొబైల్ టీముల ద్వారా వ్యాక్సిన్ ఇచ్చామన్నారు.
కరోనా థర్డ్ వేవ్ రావాలంటే కొత్త వేరియంట్ రావాలని.. లేదంటే వచ్చే పరిస్థితి లేదని.. కొత్త వేరియంట్ వచ్చే వరకు 3వ వేవ్ రాదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి రోజు 3 లక్షల మందికి వ్యాక్సినేషన్ ఇస్తామని,.. 20 లక్షల వ్యాక్సిన్ ప్రస్తుతం అందుబాటులో ఉందన్నారు. ఈ నెలలో 25 లక్షల డోసులు రాబోతున్నాయని, ఈ సీజన్ లో వచ్చే రోగాలకు అన్ని ఒకే లక్షణాలు ఉంటాయన్నారు. ప్రస్తుతం 95 శాతం వైరల్ ఫీవర్స్.. మలేరియా 2 జిల్లాలో ఎక్కువగా వస్తున్నాయని ఆయన తెలిపారు.