Telangana: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఇది కూడా దేశంలోనే తొలిసారి..

Telangana: కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయటం కోసం, అత్యవసరంలో ఉన్న బాధితులను త్వరగా ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో అనూహ్యమైన, కీలకమైన నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రాణవాయువును వేరే స్టేట్ నుంచి తెప్పించేందుకు కేసీఆర్ సర్కారు దేశంలోనే తొలిసారిగా యుద్ధ విమానాలను వినియోగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కొవిడ్-19 టీకాల పంపిణీకి సైతం దేశంలోనే మొదటిసారిగా ఆకాశ మార్గాన్ని ఎంచుకోవటం విశేషం. రవాణా సదుపాయంలేని ప్రదేశాలకు వ్యాక్సిన్లను చేరవేసేందుకు డ్రోన్లను వాడుకోవాలని డిసైడ్ అయింది. దీనికి తాజాగా శుక్రవారం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కూడా ఓకే చెప్పటం గమనార్హం.

ఇప్పటికే వినియోగం..

తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికే దేశంలోనే ప్రప్రథమంగా కరోనా మందులను డ్రోన్ల ద్వారా అందజేసేందుకు అనుమతి పొందింది. నదులు, కాల్వల తీరంలోని గ్రామాలకి ఈ పద్ధతిలోనే సరఫరా చేస్తోంది కూడా. అలాగే జనం విపరీతమైన రద్దీగా ఉండే ప్రదేశాల్లో వాళ్లు కాస్త సమాజిక దూరం పాటించేలా చూడటం, ఫారెస్ట్ ఏరియాల్లో విత్తనాలు చల్లటం తదితర అవసరాలకు డ్రోన్ల సాయం తీసుకుంటోంది. విదేశాల్లో ఈ టెక్నాలజీ ఎక్కువగా వాడుతుండటంతో రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు మంత్రి కేటీఆర్ స్టడీ చేయించారు. ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మినిస్ట్రీలోని నూతన సాంకేతికతల విభాగం రెండేళ్ల కిందట డ్రోన్ల వాడకంపై డ్రాఫ్ట్ ని రూపొందించింది.

సర్వీస్ ప్రొవైడర్ల ఎంపిక..

లేటెస్టుగా ఆకాశ మార్గంలో ఔషధాల చేరవేత కోసం సర్వీస్ ప్రొవైడర్లను ఎంపిక చేసింది. ఫస్ట్ టైమ్ వికారాబాద్ ఏరియా హాస్పిటల్ నుంచి వివిధ హెల్త్ సెంటర్లకు, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలకు మందులను విజయవంతంగా పంపించింది. అనంతరం మరికొన్ని ప్రాంతాల్లోనూ సక్సెస్ ఫుల్ గా అమలుచేసింది. డ్రోన్ల వాడకానికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వటం పట్ల రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సంతోషం వెలిబుచ్చారు. ఎమర్జెన్సీ టైమ్ లో అవసరమైన మెడిసిన్స్ ని సత్వరం అందజేస్తే ఎంతో మంది విలువైన ప్రాణాలను కాపాడొచ్చని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో మోడ్రన్ టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో తెలంగాణ రాష్ట్రం ముందుంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement