రాయలసీమ ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టుకు వెళ్ళిన తెలంగాణ ప్రభుత్వం
Admin - August 5, 2020 / 06:24 AM IST

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాయలసీమ ఎత్తిపోతల ఉత్తర్వులు రద్దు చేయాలని, టెండరు ప్రక్రియ చేపట్టకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ విధానంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా నీటిని అదనంగా తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తలపెట్టింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సహా ఇతర ప్రాంతాలకు ఇబ్బందులు ఏర్పడతాయని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతిలేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టవద్దని కృష్ణాబోర్డు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే టెండర్ల ప్రక్రియపై ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఇటీవల నీటిపారుదలశాఖపై జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.