CM KCR: కేసీఆర్ సర్కార్.. హైకోర్టుకు ఏం చెబుతుందో?..

Kondala Rao - May 7, 2021 / 03:04 PM IST

CM KCR: కేసీఆర్ సర్కార్.. హైకోర్టుకు ఏం చెబుతుందో?..

CM KCR తెలంగాణ రాష్ట్రంలో ఎట్టిపరిస్థితుల్లోనూ లాక్ డౌన్ పెట్టబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తేల్చిచెప్పారు. లాక్ డౌన్ వల్ల పెద్దగా ఉపయోగం లేదని, పైగా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కూడా అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వీకెండ్ లాక్ డౌన్ పెడతారా లేక నైట్ కర్ఫ్యూ వేళలను ఇంకా ముందుకు జరుపుతారా అనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే రేపు శనివారం లోగా ఈ రెండింటిలో ఏదో ఒక నిర్ణయాన్ని తమకు చెప్పాలని హైకోర్టు గడువు విధించిన సంగతి తెలిసిందే. దీంతో కేసీఆర్ సర్కారు న్యాయస్థానానికి ఏం చెప్పబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం చెప్పేదానికి కోర్టు ఒప్పుకుంటుందా అనేది కూడా చూడాలి.


కేంద్రంతో మాట్లాడి..

తెలంగాణలోని ప్రస్తుత కరోనా పరిస్థితులను సీఎం కేసీఆర్ నిన్న గురువారం రాత్రి ప్రధానమంత్రి మోడీకి ఫోన్ లో తెలిపారు. రాష్ట్రానికి అవసరమైన కొవిడ్ టీకాలు, ఆక్సీజన్, ఇంజక్షన్ల గురించి చెప్పారు. దీంతో ప్రధాని స్పందించి కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ కి వీటిని సమకూర్చే బాధ్యతను అప్పగించారు. పక్క రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కి కరోనా బాధితులు పెద్ద సంఖ్యలో వస్తుండటం వల్లే స్థానికులకి కొంచెం ఇబ్బందవుతోందని ముఖ్యమంత్రి ప్రధానితో అన్నారు. జిల్లా ఆస్పత్రుల్లో 5 వేల ఆక్సీజన్ బెడ్లని సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కరోనా వల్ల ప్రజలు ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం అడ్వాన్స్ గా ఇచ్చే మెడికల్ కిట్లను వాడుకోవాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వచ్చి వీటిని ఇస్తారని, పాటించాల్సిన జాగ్రత్తలతోపాటు మందులనూ అందజేస్తారని తెలిపారు. హైకోర్టుకు కూడా ఈ విషయాలనే చెబుతారంటున్నారు.


ఆయన్ని మర్చిపోం..

ఉత్తరప్రదేశ్ కి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) పార్టీ ప్రెసిడెంట్ అజిత్ సింగ్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతిని వెలిబుచ్చారు. ఆయన కుటుంబానికి సానుభూతిని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి, ఈ దిశగా సాగిన రాజకీయ ప్రక్రియకి అజిత్ సింగ్ సపోర్ట్ చేశారని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. అలాంటి నేతని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని పేర్కొన్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us