Jai Telangana: ఒక అమ్మాయి పేరు.. ‘జై తెలంగాణ’..

Jai Telangana: అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చాటుకుంటూ ఉంటారు. నచ్చిన వ్యక్తి పేరుని తన పిల్లలకి పెట్టుకోవటం సహజం. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో తన కుమారుడికి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అని నామకరణం చేశారు. ఆ తర్వాత కేసీఆర్ టీడీపీ నుంచి బయటికి వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరుతో 2001 ఏప్రిల్ 27న సొంత పార్టీ పెట్టారు. ఇది జరిగి నేటికి (2021 ఏప్రిల్ 27) సరిగ్గా 20 ఏళ్లు. అప్పట్లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జోరుగా సాగేది. ప్రతిఒక్కరూ ఒకే ఒక్క నినాదంతో ముందుకు కదిలారు. అదే.. ‘జై తెలంగాణ’.

అన్ని చోట్లా.. ఈ పేరే..

మెదక్ టౌన్ శివారులోని పిల్లికోటాల్ ప్రాంతానికి చెందిన మ్యాకల నాగేశ్వర్-పద్మావతి దంపతులు వ్యవసాయ కూలీలు. నాగేశ్వర్ తెలంగాణ వీరాభిమాని. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. ఈ దంపతులకు ఇద్దరు ఆడ బిడ్డలు. పెద్దమ్మాయి పేరు అన్నపూర్ణ. రెండో అమ్మాయి 2004 ఏప్రిల్ 23 తేదీన జన్మించింది. మరో నాలుగు రోజుల్లో టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం ఉన్న నేపథ్యంలో నాగేశ్వర్ తన చిన్న కూతురికి ‘జై తెలంగాణ’ అని పేరు పెట్టాడు. ఆమెకి ఇప్పుడు 17 సంవత్సరాలు నిండాయి. అంగన్ వాడీ నుంచి ఆధార్ కార్డు వరకు, రేషన్ కార్డు నుంచి కాలేజీ రికార్డ్స్ వరకు ఆమె పేరు ‘జై తెలంగాణ’ అనే కొనసాగుతోంది. ఆ అమ్మాయి ఇప్పుడు ఇంటర్ సెకండియర్ చదువుతోంది.

నామోషీ అనుకోలేదు..

తన బిడ్డకు ‘జై తెలంగాణ’ అని పేరు పెట్టుకోవటం నామోషీగా లేదని, సగర్వంగా ఉందని మ్యాకల నాగేశ్వర్ చెబుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలనే ఆకాంక్షతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆయన కోరుకున్నట్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. మనం సహజంగా మన పిల్లలకు పేర్లు పెట్టడానికి రకరకాలుగా ఆలోచిస్తాం. ఏ పేరైతే బాగుంటుంది అని బంధుమిత్రులను అడిగి మరీ తెలుసుకుంటాం. కానీ.. నాగేశ్వర్ అలాంటివేమీ చేయకుండా, వెనకా ముందు ఆలోచించకుండా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు(2014)కి పదేళ్ల ముందే (2004లోనే) ఇలా ముందుచూపు ప్రదర్శించటం చెప్పుకోదగ్గ విషయం. తన బిడ్డను ఎవరైనా ‘జై తెలంగాణ’ అంటూ పదే పదే పిలుస్తూ ఎగతాళి చేస్తారేమో అనే సంకోచం లేకుండా ఈ పేరు పెట్టడం నిజంగా గ్రేట్. హ్యాట్సాఫ్ నాగేశ్వర్. ‘జై తెలంగాణ’.

Advertisement