Telangana : కర్ఫ్యూ.. కంటిన్యూ..

Telangana కరోనా కట్టడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూని మరో వారం రోజులు పొడిగించింది. ఈ ఆంక్షలు మే నెల 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళ శుక్రవారం మధ్యాహ్నం ప్రకటన చేసింది. పూర్తి వివరాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులను విడుదల చేశారు. కొవిడ్-19 వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో తొలిసారిగా కర్ఫ్యూని ఈ నెల 20వ తేదీన విధించిన సంగతి తెలిసిందే. అత్యవసరం కిందికి రాని సర్వీసులన్నింటినీ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బంద్ చేయాలని చెప్పారు. అది అమల్లో ఉన్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో మరికొన్ని రోజుల పాటు కర్ఫ్యూని కంటిన్యూ చేస్తారనే అభిప్రాయం అన్ని వర్గాల్లోనూ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు రోజుల కిందటే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ప్రస్తుత పరిస్థితులను తెలుసుకుంది.

హైకోర్ట్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న కొవిడ్ పరిస్థితులపై ఇవాళ శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. కర్ఫ్యూని పొడిగిస్తారా లేదా అని నిన్న గురువారమే గట్టిగా అడిగిన న్యాయస్థానం ఈ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్కారు గనక ఏదో ఒకటి చెప్పకపోతే తామే ఆదేశాలను జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. 45 నిమిషాల్లో గవర్నమెంట్ రియాక్షన్ ఏంటో తమకు తెలియజేయాలంటూ అడ్వొకేట్ జనరల్ కి డెడ్ లైన్ విధించింది. దీంతో ప్రభుత్వం తక్షణం స్పందించింది.

24 గంటల్లో.. 53 మంది బలి..

తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 77,091 మంది నుంచి కరోనా నమూనాలను సేకరించగా అందులో పది శాతం మందికి అంటే 7,646 మందికి పాజిటివ్ అని తేలింది. కొవిడ్ తో పోరాడుతూ 53 మంది కన్నుమూశారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 4 లక్షల 35 వేల 606 మంది ఈ మహమ్మారి బారినపడగా 2,261 మంది చనిపోయారు. నిన్న గురువారం ఒక్క రోజే దాదాపు 6 వేల మంది ఈ జబ్బు నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,727 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో గత 24 గంటల్లో 1,441 కేసులు నమోదయ్యాయి.

Advertisement