Teja Sajja: నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్న జూనియ‌ర్ చిరంజీవి

Teja Sajja: తెలుగు ఇండస్ట్రీకి ఎంతోమంది కొత్త హీరోలు వస్తుంటారు కానీ అందులో కొందరు మాత్రమే నిలబడుతుంటారు.. గుర్తింపు తెచ్చుకుంటారు. అందులో తాను కూడా ఒకడిగా ఉండాలని మ్యాగ్జిమమ్ ట్రై చేస్తున్నాడు తేజ సజ్జ. ఈయన్నే ముద్దుగా జూనియర్ చిరంజీవి అంటారు కూడా. ఎందుకంటే ఇంద్ర సినిమాలో చిన్నప్పటి చిరుగా నటించాడు కాబట్టి.

అప్పట్నుంచే బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇప్పుడు హీరోగా మారి వరస సినిమాలు చేస్తున్నాడు. 1997లో మూడేళ్ళ వయసులో ప్రియరాగాలు సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఈయన.. దాదాపు 40 సినిమాలకు పైగానే నటింటాడు. బాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తేజ సజ్జ. ముఖ్యంగా చిరంజీవి హీరోగా నటించిన ఇంద్ర సినిమాలో చిన్నప్పటి మెగాస్టార్ గా నటించి క్రేజ్ తెచ్చుకున్నాడు.

తెలంగాణ శకుంతలతో నేనున్నానే నాయనమ్మా అంటూ తొడ కొట్టి స్టార్ అయిపోయాడు తేజ. ఇప్పటికీ ఆ డైలాగ్ చెప్తుంటాడు తేజ. ఆ తర్వాత అదే ఊపులో చాలా సినిమాలు చేసాడు ఈ చిన్నోడు. రెండేళ్ల కింద సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి తెరకెక్కించిన ఓ బేబీ సినిమాతో మళ్లీ పరిచయం అయ్యాడు తేజ. అందులో చాలా కీలక పాత్రలో నటించాడు తేజ. మొన్నటికి మొన్న ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన జాంబి రెడ్డి సినిమాతో లీడ్ హీరోగా మారిపోయాడు.

ఇప్పుడు ఇష్క్ అనే సినిమాతో వస్తున్నాడు. దాంతో పాటు మరో రెండు సినిమాలు కూడా కమిటయ్యాడు తేజ. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ తో పాటు అద్భుతం అనే మరో సినిమాలోనూ నటిస్తున్నాడు తేజ. ఇదిలా ఉంటే ఈయన రెమ్యునరేషన్ కు ఇప్పుడు రెక్కలొచ్చినట్లు తెలుస్తుంది. జాంబి రెడ్డి సినిమాకు థియేట్రికల్ కలెక్షన్స్ తో పాటు డిజిటల్, శాటిలైట్ అన్నీ కలిపి 10 కోట్లకు పైగానే వచ్చినట్లు తెలుస్తుంది.

రాబోయే సినిమాల బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది. అందుకే ఈ కుర్రాడు తర్వాతి సినిమా కోసం కోటి రూపాయల పారితోషికం అందుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. నిర్మాతలు కూడా అన్ని లెక్కలు వేసుకున్న తర్వాత సరే ఇవ్వొచ్చు అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఏదేమైనా చాలా వేగంగా ఎదుగుతున్నాడు కానీ అంతే వేగంగా కింద పడిపోకుండా జగ్రత్త పడాల్సిన అవసరం తేజకు ఎంతైనా ఉంది.