Team India Player: క‌రోనా సోకిన టీమిండియా ప్లేయ‌ర్ ఎవ‌రో తెలుసా?

Team India Player: క‌రోనా మ‌హ‌మ్మారి క్రీడ‌ల‌పై కూడా ప్ర‌భావం చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే క‌రోనా వ‌ల‌న ప‌లు టోర్నీలు ర‌ద్ధ‌య్యాయి. ఐపీఎల్‌ని శాశ్వ‌తంగా ర‌ద్దు చేసిన నిర్వాహ‌కులు త్వ‌ర‌లో దుబాయ్‌లో మిగ‌తా మ్యాచ్‌లు నిర్వ‌హించ‌నున్నారు. మ‌రోవైపు ఇంగ్లండ్ టీంలోను క‌రోనా క‌ల‌కలం రేగిన సంగ‌తి తెలిసిందే.తాజాగా ఇండియా టీంలో ఓ స‌భ్యుడికి కరోనా సోకిందని అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఆ స‌భ్యుడి విష‌యాన్ని సీక్రెట్‌గా ఉంచ‌డంతో ఆ ఆట‌గాడు ఎవ‌ర‌నే విష‌యంపై అంద‌రిలో సందేహాలు నెల‌కొన్నాయి.

Team India Player
Team India Player

స్పోర్ట్స్ టాక్ అనే మీడియా సంస్థ ప్ర‌కారం ఇండియ‌న్ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ క‌రోనా బారిన ప‌డ్డ‌ట్టు వెల్ల‌డించింది. వారం కింద‌టే అత‌నికి క‌రోనా సోకింద‌ని, అయితే ల‌క్ష‌ణాలేవీ లేవ‌ని తెలిపింది. యూరోలో భాగంగా లండ‌న్‌లోని వింబ్లే స్టేడియంలో ఇంగ్లండ్‌, జ‌ర్మ‌నీ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ చూడ‌టానికి పంత్ వెళ్లగా ఆ స‌మ‌యంలో అత‌నికి క‌రోనా సోకి ఉంటుంద‌ని భావిస్తున్నారు.

పంత్ ప్ర‌స్తుతం ఐసోలేష‌న్‌లో ఉన్నాడు. అత‌డు డ‌ర్హ‌మ్ వెళ్లిన టీమ్‌తో ఇప్ప‌ట్లో క‌లిసే అవ‌కాశం లేదు. అటు బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా కూడా ఓ ప్లేయ‌ర్‌కు క‌రోనా సోకిన మాట నిజమే అని చెప్పినా.. అత‌ని పేరు మాత్రం చెప్ప‌లేదు. అవును, ఓ ప్లేయ‌ర్‌కు క‌రోనా వ‌చ్చింది. అత‌డు 8 రోజులుగా ఐసోలేష‌న్‌లో ఉంటున్నాడు. అత‌డు హోట‌ల్ రూమ్‌లో ఉండ‌టం లేదు. అందువ‌ల్ల మిగ‌తా ప్లేయ‌ర్స్‌పై దీని ప్ర‌భావం లేదు. అయితే ఆ ప్లేయ‌ర్ పేరు మాత్రం చెప్ప‌లేను అని పీటీఐతో శుక్లా చెప్పారు. పంత్‌కు డెల్టా వేరియంటే సోకింది. ఈ వేరియంటే ఇండియాలో సెకండ్ వేవ్‌కు కార‌ణ‌మైన విష‌యం తెలిసిందే.

బుధవారం బీసీసీఐ ప్రెసిడెంట్‌ గంగూలీ, చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ కోల్‌కతాలో సమావేశంకాగా, ఏం చర్చించారనే విషయంపై గోప్యతను ప్రదర్శించారు. ఇంగ్లండ్‌లో ప్ర‌స్తుతం డెల్టా వేరియెంట్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో బీసీసీఐ సెక్రెటరీ జై షా అప్రమత్తంగా ఉండాలని మిగతా ఆటగాళ్లను ఉద్దేశించి ఓ మెయిల్‌ లేఖను పంపారు. ఆట‌గాడికి ఎలా క‌రోనా సోకింద‌నే దానిపై విచార‌ణ జ‌రుపుతున్నారు.

వింబుల్డన్, యూరో కప్ మ్యాచ్‌లని చూసేందుకు స్టేడియాలకి వెళ్లి.. అక్కడ అభిమానులతో కలిసి క్రికెటర్లు మ్యాచ్‌లు చూడటాన్ని జై షా తప్పుబట్టారు. అభిమానులతో కలిసి మ్యాచ్‌లను చూసే సమయంలో భారత క్రికెటర్లు కనీసం మాస్క్ కూడా ధరించకపోగా.. సామాజిక దూరాన్ని విస్మరించడంపై ఇటీవల విమర్శలు వచ్చాయి