Virat Kohli: మొద‌టి మ్యాచ్.. ఇంకా అయిపోలేదు… ఓట‌మిపై విరాట్ కామెంట్స్

Virat Kohli ఆదివారం జ‌రిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌.. భార‌త్‌పై సునాయాసంగా గెలిచింది. భారత్‌ చేతిలో 12 సార్లు ఓడిన పాక్‌ పదమూడో ప్రయత్నంలో ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. షాహీన్‌ షా అఫ్రిది నిప్పులు చెరిగే బౌలింగ్‌కు ఓపెనర్లు రిజ్వాన్‌, బాబర్‌ అజేయ అర్ధశతకాలు తోడవడంతో కోహ్లీసేనపై పాక్‌ పైచేయి సాధించింది.

పాక్ అద్భుత‌మైన బౌలింగ్‌తో రోహిత్‌శర్మ, రాహుల్‌, సూర్యకుమార్‌ వికెట్లను కోల్పోయిన టీమ్‌ఇండియా మళ్లీ కోలుకోలేపోయింది. మిడిల్‌లో పంత్‌ దూకుడు కనబరిచినా.. హార్దిక్‌ పాండ్యా అంచనాలు అందుకోలేకపోయాడు. లక్ష్యఛేదనకు దిగిన పాక్‌..భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ వికెట్‌ కోల్పోకుండా విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

ఓట‌మిపై మాట్లాడిన కోహ్లీ.. క్రెడిట్‌ అంతా డ్యూ(తేమ)దే. పాకిస్తాన్‌ ఈరోజు ఆడిన విధానం కూడా బాగుంది. బంతితో శుభారంభం అందుకున్నారు. ఆదిలోనే 3 వికెట్లు కోల్పోవడం(తమ జట్టు ప్రదర్శనను ఉద్దేశించి) ఏవిధంగానూ చెప్పుకోదగ్గ విషయం కాదు. 15-20 అదనపు పరుగులు రాబట్టాల్సింది. కానీ పాకిస్తాన్‌ బౌలర్లు మాకు ఆ అవకాశం ఇవ్వలేదు.

మా బలాబలాలేమిటో మాకు తెలుసు. స్లో బౌలర్‌ లేకపోవడం లోటు అనడానికి అంతగా ఆస్కారం లేదు. డ్యూ ఉన్నపుడు వాళ్లు పెద్దగా ప్రభావం చూపలేరు. అయినా టోర్నమెంట్‌లో ఇది మొదటి మ్యాచ్‌… చివరిదైతే కాదు కదా’’అని కోహ్లీ అన్నారు. ఓటమిని హుందాగా అంగీకరించిన కోహ్లి… తదుపరి మ్యాచ్‌లలో సత్తా చాటగలమని విశ్వాసం వ్యక్తం చేశాడు.

కాగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో ఇప్పటి వరకు పాకిస్తాన్‌తో జరిగిన 5 మ్యాచ్‌లలో టీమిండియాదే పైచేయి అన్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌ నెగ్గకపోయిన ఫర్వాలేదు.. పాకిస్థాన్‌ చేతిలో మాత్రం ఓడిపోవద్దు అనుకునే సగటు భారత క్రీడాభిమానిని నిరాశలోకి నెట్టిన కోహ్లీసేన.. ఇక విశ్వకప్‌ నెగ్గి ఈ గాయానికి మందు పూస్తుందేమో చూడాలి!