TDP Leaders : తెలంగాణలో టీడీపీ, జనసేన విచిత్ర విన్యాసాలు!
NQ Staff - November 21, 2023 / 07:48 PM IST

TDP Leaders :
రాజకీయ పార్టీల వైఖరెంటో ఒక్కొక్కసారి అసలే అర్థం కాదు. తమకు లాభం అనుకుంటే చాలు ఏ పని చేయడానికైనా నిసిగ్గుగా తయారైపోతాయి. ఎదుటి పార్టీని దెబ్బతీయడానికి ఎంత వరకైనా వెళ్తాయి. ఇక పొత్తులు పెట్టుకోవడం గానీ, విడిపోవడం గానీ తమ తమ స్వార్థపూరిత నిర్ణయాల మేరకు ఉంటాయి. దేశంలో అన్ని పార్టీలది ఇదే తంతు..
ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రా పార్టీలు టీడీపీ, జనసేన సర్కస్ ఫీట్లు చేస్తున్నాయి. తెలంగాణ నుంచి 2014లోనే బకెట్ తన్నేసిన టీడీపీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో కూటమి కట్టింది. కేసీఆర్ దెబ్బతో దెబ్బకు తెలంగాణ వదిలిపోయింది. ప్రస్తుత ఎన్నికల్లో తాను పోటీ చేస్తే ఒక్క సీటు గెలిచే అవకాశం లేదు. అందుకే బరిలో నిలవలేదు. కానీ హైదరాబాద్, ఖమ్మం ప్రాంతాల్లో తమ సామాజిక వర్గ ఓట్లతో తమ శిష్యుడి పార్టీని గెలిపించుకోవడానికి తహతహలాడుతోంది. పోటీ చేయకున్నా సరే తెలంగాణను ‘‘నేను వదల బొమ్మాళి’’ అన్నట్టుగా ప్రచార పర్వంలో పాల్గొంటోంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభలో టీడీపీ జెండాలు రెపరెపలాడడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ.. ఆ పార్టీ గెలుపు కోసం నానా ప్రయత్నాలు చేయడం ఓ రకంగా రాజకీయ వైచిత్రి. అలాగే ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థులు తుమ్మల నాగేశ్వర్ రావు, భట్టి విక్రమార్కకు మద్దతుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు.
అయితే టీడీపీ పరిస్థితి ఇలా ఉంటే..బీజేపీతో పొత్తులో ఉన్నా జనసేన మాత్రం ప్రచారం చేస్తున్న దాఖలాలు లేవు. మోదీ సభలో పాల్గొన్న జనసేననాని పవన్ కల్యాణ్.. ఆ తర్వాత మళ్లీ ఎక్కడా కనపడడ లేదు. బీజేపీతో పొత్తు 8 సీట్లలో పోటీ చేస్తున్నా.. కనీసం ప్రచార ఆర్భాటం కనపడడం లేదు. ఇక హైదరాబాద్ లో కూడా ఎక్కడా జనసేన జెండాలు, కాషాయ జెండాలతో కలిసి పనిచేస్తున్నట్టు కనపడడం లేదు. ఈనెల 26న అమిత్ షాతో కలిసి పవన్ కల్యాణ్ సభలో పాల్గొంటారని నాదేండ్ల మనోహర్ చెప్పడం గమనార్హం. కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పాల్గొనకుండా.. నాయకుడు మీటింగ్ లో పాల్గొంటే ఏమేరకు ఫలితాలు వస్తాయో జనసేనానికే తెలియాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

TDP Leaders Campaigning In Support Of Thummala Nageswar Rao
వాస్తవానికి పొత్తులో ఉన్న బీజేపీ, జనసేన అసలు ఎన్నికలతో సంబంధం లేదన్నట్టు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. పొత్తులో లేని టీడీపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి. బీఆర్ఎస్ ను గద్దె దించేందుకు నానా పాట్లు పడుతున్నాయి. కాగా, టీడీపీ, జనసేన పార్టీల వింత నిర్ణయమే అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీ బద్ధ శత్రువులు. అలాంటి పార్టీలకు ఏపీలో జాన్ జిగిరి దోస్తానా చేస్తున్న టీడీపీ, జనసేన వేర్వేరుగా పొత్తు పెట్టుకుని ..వాటి గెలుపునకు ప్రయత్నం చేస్తున్నాయి. వీటి నిర్ణయాల్లో ‘స్వకార్యం’ తప్ప ప్రజాక్షేమం అణువంత కూడా కనపడడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.