వైసీపీ నాయకులు రూ. 500 కోట్ల అవినీతికి పాల్పడ్డారు: చంద్రబాబు
Admin - August 20, 2020 / 08:08 AM IST

ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో దాదాపు రూ. 500 కోట్ల మేరకు అవినీతి జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ అవినీతిలో వైసీపీ నాయకులు పెద్ద మొత్తంలో డబ్బును దండుకున్నారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఇళ్ల నిర్మాణాలనికి అనువుగాని భూములను సేకరించారని, చిత్తడి నేలలు, ముంపు భూములు, మడ అడవులను ప్రభుత్వమే కొనుగోలు చేయడం దుర్భరమని మండిపడ్డారు. ఆవ భూములు, చిత్తడి నేలల సేకరణ పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకమని చంద్రబాబు అన్నారు.
ముంపుకు గురైన ప్రాంతాల్లో పేదలకు ఇళ్లను నిర్మిస్తే వారి ప్రాణాలకే ముప్పు అని తెలిపారు. పేదల ఆస్తులకు నష్టం చేసి.. వారిని మరింత పేదరికంలోకి నెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లపట్టాల భూసేకరణలో సరికొత్త అవినీతికి అంకురార్పణ చేసిన అధికార వైకాపా నాయకులు స్థానిక అధికారులతో కుమ్మక్కై దోపిడికి పాల్పడ్డారని దుయ్యబట్టారు.