TBJP Party : టీబీజేపీకి బీసీలు ఇప్పుడే గుర్తుకు వచ్చారా.. దమ్ముంటే ఆ పని చేయగలదా..?
NQ Staff - November 5, 2023 / 11:18 AM IST

TBJP Party :
రాజకీయాలు అంటేనే బురిడీ కొట్టించాలనే సూత్రాలు బీజేపీకి బాగా తెలుసు. ఎన్నికలకు ముందే ఏదేదో చెప్పేసి.. తర్వాత వాటిని పక్కన పెట్టేయడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. అయితే ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు వచ్చే సరికి.. ఓ మంత్రాన్ని జపిస్తోంది టీబీజేపీ పార్టీ. అదే బీసీ మంత్రం. బీసీ నేతలను ముఖ్యమంత్రిని చేస్తామని చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు బీసీల నిరసనలు, ధర్నాలు బాగా జరుగుతున్నాయి. పైగా బీఆర్ ఎస్ లో బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించలేదనేది టీబీజేపీ ఆరోపణలు. అసలు టీబీజేపీ నేతలకు బీసీలు ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చారు.
ఇన్నేళ్లు వారి గురించి ఎందుకు మాట్లాడలేదు. ఎందుకంటే ఇప్పుడు బీసీల ఓటు బ్యాంకుతో ముందుకు వెళ్లాలని బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు బీసీ నేతనే సీఎం చేస్తామని.. ప్రకటిస్తున్నారు. అదే సందర్భంలో నరేంద్ర మోడీ రాక సందర్భంగా కూడా బీసీ సభనే ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. అదే క్రమంలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలు కూడా బీసీ నేతలను సీఎం అభ్యర్థులుగా ప్రకటించగలవా అని సవాల్ విరుసురుతున్నారు టీబీజేపీ నేతలు. ఇదే ఇప్పుడు అందరికీ అనుమానాలు కలిగిస్తోంది. ఎందుకంటే ఒక బీసీ నేత అయిన బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించిందే బీజేపీ పార్టీ.
రెడ్డి అయిన కిషన్ రెడ్డికి రెండోసారి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చింది. ఇది బీసీ నేతకు చేసిన అన్యాయం కాదా.. మరి దీనిపై ఎందుకు మాట్లాడట్లేదు. ఇన్ని రోజులు పార్టీని ఒక స్థాయికి తెచ్చిన బీసీ నేతకు అన్యాయం చేసి ఓసీకి ఇచ్చిన ఘనత బీజేపీది కాదా.. పోనీ ఇప్పుడు బీజేపీ లాగానే బీఆర్ ఎస్ కూడా బీసీ నేతనే సీఎం చేస్తామని ప్రకటించిందే అనుకో.. అప్పుడు బీజేపీ భేషరతుగా పోటీ చేయకుండా బీఆర్ ఎస్ కు మద్దతు ప్రకటిస్తుందా.. ఎందుకంటే వారికి కావాల్సింది బీసీ నేతను ముఖ్యమంత్రి చేయడమే కదా.. అది ఏ పార్టీ అయితే ఏంటి అని పక్కకు ఉంటుందా..
అలా ఉండనప్పుడు ఈ సవాళ్లు చేయడం ఎందుకు. మొన్న లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఇలాంటి సవాలే చేశారు. తమలాగే కాంగ్రెస్, బీఆర్ ఎస్ కూడా బీసీ నేతలను సీఎం చేస్తామని చెప్పాలని సవాల్ విసిరారు. బీఆర్ ఎస్ ఇప్పటికే ఈ విషయంలో క్లియర్ గా ఉంది. మూడోసారి సీఎంగా కేసీఆరే ఉంటారని ప్రకటించింది.
అటు కాంగ్రెస్ ఎలాగూ బీసీ జెండాను ఎత్తుకోదు. అలాంటప్పుడు ఓట్ల కోసం బీజేపీ ఇలా లేనిపోని ప్రేమలు బీసీల మీద ఒలకబోయడం ఎంత వరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి కదా. బీసీల కోసం ఏమైనా చేయగలం అనే సత్తా ఉంటేనే సవాళ్లు విసరాలి. లేదంటే సైలెంట్ గా ఉండాలంటున్నారు బీఆర్ ఎస్ నేతలు.