Tamil Nadu Government : తమిళనాడులోకి సీబీఐకి నో ఎంట్రీ.. స్టాలిన్ సంచలన నిర్ణయం..!
NQ Staff - June 15, 2023 / 10:41 AM IST

Tamil Nadu Government : సీబీఐకి తమిళనాడు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇక నుంచి తమిళనాడులోకి తలుపులు మూసేస్తూ స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీబీఐకి జనరల్ కన్సెంట్ ను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది డీఎంకే ప్రభుత్వం. దీంతో సీబీఐ ఏ కేసు దర్యాప్తు చేయాలన్నా సరే ఇక నుంచి తమిళ నాడు ప్రభుత్వం అనుమతి ఉండాల్సిందే.
డైరెక్టుగా ఎంట్రీ కావడానికి వీలులేదు. ఇలా జనరల్ కన్సెంట్ ను ఉపసంహరించుకున్న పదో రాష్ట్రంగా తమిళ నాడు ప్రభుత్వం నిలిచింది. తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే స్టాలిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
డీఎంకే ప్రభుత్వం మొదటి నుంచి బీజేపీని వ్యతిరేకిస్తోంది. కేంద్ర బీజేపీ పెద్దలతో కొన్ని విబేధాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తమ పార్టీలోని నేతలను టార్గెట్ చేస్తారనే ఉద్దేశంతో స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో తెలంగాణ కూడా సీబీఐ విషయంలో ఇలాంటి నిర్ణయమే తీసుకుంది.
ఇప్పుడు డీఎంకే ప్రభుత్వం కూడా ఇదే పని చేసింది. దేశంలో ఇప్పటి వరకు సీబీఐకి తొమ్మిది రాష్ట్రాలు జనరల్ కన్సెంట్ ను ఉపసంహరించుకున్నాయి. ఇందులో తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, కేరళ, ఝార్ఖండ్, పంజాబ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలు ఉండగా.. తాజాగా స్టాలిన్ ప్రభుత్వం కూడా చేరిపోయింది.