Tamil Brahmanandam: ఇది దేవుడు నిర్మించి, విడుదల చేసిన సినిమా

Tamil Brahmanandam: కరోనా వైరస్ అనబడే మల్టీ లాంగ్వేజ్ మూవీని సాక్షాత్తూ ఆ దేవుడే నిర్మించి విడుదల చేశాడని ‘‘తమిళ బ్రహ్మానందం’’గా అభిమానులు ప్రేమతో పిలుచుకునే సీనియర్, పాపులర్ కోలీవుడ్ కమెడియన్ వడివేలు జోక్ చేశారు. ఈ సినిమాని ప్రతిఒక్కరూ ఇంట్లో ఉండే చూడాలని సెటైరికల్ గా చెప్పారు. కొవిడ్-19 అనే మరో పేరు కూడా కలిగిన ఈ చిత్ర నిరవధిక ప్రదర్శనను భగవంతుడు ఎప్పుడు నిలిపేస్తాడో తెలియదని నిర్వేదాన్ని వ్యక్తం చేశారు. అయినా ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ప్రతిఒక్కరూ గవర్నమెంట్ చెప్పిన గైడ్ లైన్స్ కి అనుగుణంగా నడుచుకుంటే చాలని అభిప్రాయపడ్డారు. నిమ్మకాయ రసంతో టీ పెట్టుకొని తాగాలని, ఆవిరి పడుతూ కరోనా వైరస్ బారినపడకుండా ఉండాలని సూచించారు.

పిక్చర్లు తీసేవారేరి?..

కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఫిల్మ్స్ తీసేందుకు ఎవరూ ముందుకు రావట్లేదని వడివేలు అన్నారు. ఒకవేళ ఎవరైనా మొండి ధైర్యంతో మూవీలను తెరకెక్కించినా వాటిని చూడటానికి జనం థియేటర్లకు రావట్లేదని చెప్పారు. కరోనా వైరస్ అందర్నీ కలవరపెడుతోందని, ఎవరినీ తాకటానికి గానీ, ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వటానికి గానీ అవకాశమే లేకుండా పోయిందని అసంతృప్తిని వెలిబుచ్చారు. సన్నిహితుల దగ్గరికి చనువుతో వెళ్లేందుకు కూడా ఛాన్స్ లేదని, కనీసం ఆరడుగుల దూరం పాటించాలని, ముఖానికి మాస్క్ పెట్టుకోవాలని గుర్తు చేశారు. ఇన్ని ఆంక్షల నేపథ్యంలో అన్ని రకాల చిత్రీకరణలు నిలిచిపోయాయని, దీంతో సినీ జనాలు చేతిలో పనిలేక ఇంట్లో ఖాళీగా కూర్చోవాల్సి వస్తోందని వడివేలు నిట్టూర్చారు.

ఎంత కష్టమో?..

పనీ పాటా లేకుండా ఇంట్లో ఊరికే ఉండటం ఎంత కష్టమో తనకు ఇప్పుడు ప్రత్యక్షంగా అర్థమవుతోందని తమిళ బ్రహ్మానందం తెలిపారు. వడివేలు ఇటీవల కొవిడ్ వైరస్ వ్యాప్తితోపాటు వ్యాక్సినేషన్ పై జనంలో అవగాహన కల్పిస్తున్నారు. సెల్ఫీ వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. లేటెస్టుగా పోస్ట్ చేసిన ఓ వీడియోలో ఆయన పైన పేర్కొన్న సంగతులన్నీ చెప్పారు. వడివేలు తమిళంలో నటించిన సినిమాలను తెలుగులోకి అనువదించేటప్పుడు టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంతో డబ్బింగ్ చెప్పిస్తుంటారనే సంగతి ప్రేక్షకులకి తెలిసిందే. వడివేలు యాక్షన్ కి, బ్రహ్మీ డైలాగులకు భలే సింక్ అవుతుంది. అందుకే వడివేలును తమిళ బ్రహ్మానందంగా పేర్కొంటూ ఉంటారు.