Suriya: అభిమానులకు సాయం చేసిన సూర్య.. పెద్ద మనసుపై ప్రశంసలు
Samsthi 2210 - June 14, 2021 / 03:37 PM IST

Suriya: ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ప్రత్యక్షమయ్యే సెలబ్రిటీస్‌లో సూర్య ఒకరు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడల్లా తన వంతు సాయం అందిస్తూ వస్తున్న సూర్య గత ఏడాది కరోనా వలన ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉండడంతో చాలా మంది ఆధారం కోల్పోయారు. ఈ క్రమంలో కోలీవుడ్ హీరోలు సూర్య, కార్తి కూడా బాధితులకు అండగా నిలిచారు.
తమిళనాడు ప్రభుత్వ సహాయనిధికి వీరి కుటుంబం రూ. 1 కోటి విరాళం ప్రకటించింది. కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసిన వారు ఆయనను సత్కరించి.. ఈ సాయం అందజేశారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయం చేయాలని అభ్యర్థించారు.అలానే తమ స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా సూర్య పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
సూర్యకు ఆయన అభిమానులకు మధ్య దూరం చాలా తక్కువ. ఎప్పటికప్పుడు వారి బాగోగులు గురించి ఆరాలు తీస్తూనే ఉంటారు. తాజాగా సూర్య ఫ్యాన్స్ కష్టాలను చూసి చలించిపోయారు. ఈ నేపథ్యంలో తన ఫ్యాన్ క్లబ్‌కు చెందిన 250 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5000 చోప్పున మొత్తం రూ.12.5లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఆ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేశారట. సూర్య మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.
సూర్య గత ఏడాది ఆకాశం నీ హద్దురా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా హిట్ అందుకుంది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సూర్యతో పాటు మోహన్ బాబు కూడా కీలకపాత్ర పోషించారు. గతంలో వెంకటేష్ తో గురు చిత్రాన్ని తెరకెక్కించిన మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ మూవీని డైరెక్ట్ చేసారు. హిందీలో ఈ మూవీని షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.
ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు సూర్య. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ 35 శాతం పూర్తయింది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారట. ఈ సినిమా కాకుండా వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడీవాసల్’, టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సినిమాలు కమిట్ అయ్యారు సూర్య.