Sridhar Dharmasanam: ‘మా హైదరాబాద్’ శ్రీధర్ ధర్మాసనం ఇకలేరు.. కరోనాతో కన్నుమూత.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి..

Sridhar Dharmasanam: తెలంగాణ రాష్ట్రంలోని జాతీయ స్థాయి సీనియర్ జర్నలిస్ట్, ‘మా హైదరాబాద్’ సంస్థ వ్యవస్థాపకుడు, టీవీ ప్రోగ్రామ్స్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ శ్రీధర్ ధర్మాసనం ఇకలేరు. ఈరోజు బుధవారం ఉదయం కన్నుమూశారు. కరోనా మహమ్మారితో పది రోజులుగా పోరాడుతూ టిమ్స్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు దిగ్భ్రాంతి చెందారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్న శ్రీధర్ ధర్మాసనం మృతి పట్ల తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పాత్రికేయులకి శ్రీధర్ ధర్మాసనం ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. ‘‘కరోనా కష్టకాలంలో ప్రజలకు వాస్తవాలను అందించడం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న జర్నలిస్టు మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. మీరంతా సురక్షితంగా ఉండాలి’ అని మంత్రి హరీష్ రావు సూచించారు. పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టులు కూడా విచారం వెలిబుచ్చారు. మీడియా రంగంలో శ్రీధర్ ధర్మాసనం లేని లోటు తీర్చలేనిదని చెప్పారు. ఆయన అందించిన అసమాన సేవలను గుర్తుచేసుకున్నారు.

కరీంనగర్ లో పుట్టి.. కలం పట్టి..

శ్రీధర్ ధర్మాసనం కరీంనగర్ జిల్లా వాసి. 1965 ఏప్రిల్ 23న జన్మించారు. మొన్నే 56 ఏళ్లు నిండాయి. చదువు చాలా వరకు హైదరాబాద్ లో సాగింది. జగ్జీవన్ రామ్ కాలేజీలో డిగ్రీ, ఉస్మానియాలో జర్నలిజం చేశారు. వృత్తి రీత్యా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. మీడియాలో వివిధ హోదాల్లో పనిచేశారు. 30 ఏళ్లకి పైగా సుదీర్ఘ అనుభవం సంపాదించారు. పత్రికా రంగంలోనే కాక టీవీ రంగంలోనూ ప్రావీణ్యాన్ని చూపారు. డెక్కన్ క్రానికల్, న్యూస్ టైమ్, ఇండియన్ ఎక్స్ ప్రెస్(ముంబై) వంటి ఇంగ్లిష్ న్యూస్ పేపర్లలో చేశారు. టెలివిజన్ టేక్స్, బ్లెండ్ మ్యాగజైన్లకి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా వ్యవహరించారు. 1998లో ఢిల్లీ కేంద్రంగా వచ్చిన జైన్ టీవీ న్యూస్ ఛానల్ కి ప్రిన్సిపల్ కరస్పాండెంట్ గా, సహారా టీవీకి స్టేట్ కరస్పాండెంట్ గా సత్తా చాటారు.

దేశ-విదేశ ఘటనలను..

శ్రీధర్ ధర్మాసనం దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు విదేశీ సంఘటనలను కూడా రిపోర్ట్ చేశారు. బంగ్లాదేశ్ జనరల్ ఎలక్షన్స్, కార్గిల్ యుద్ధానికి కారణమైన పూంచ్ సెక్టారులో ఇండో-పాక్ కాల్పులు వంటి అంశాలపై వార్తలు, కథనాలు రాశారు. 1994లో లండన్ కేంద్రంగా ఉన్న వరల్డ్ వైడ్ టెలివిజన్ న్యూస్ సంస్థకి సౌత్ ఇండియా ప్రతినిధిగా సేవలందించారు. మన దేశంలో దివిసీమ ఉప్పెన, ఓఎన్జీసీ అగ్నిప్రమాదం, సునామీ, లాతూర్ భూకంపం, నక్సల్స్-ట్రైబల్స్ అనారోగ్యం, రాజస్థాన్ లో సామూహిక బాల్య వివాహాలు, అస్సాం-మేఘాలయ-నాగాలాండ్ రాజకీయ స్థితిగతులపైన శ్రీధర్ ధర్మాసనం టీవీ రిపోర్టులను రూపొందించారు.

డాక్యుమెంటరీలు.. అంతర్జాతీయ అవార్డులు..

1990ల్లో హైదరాబాదులో జరిగిన మతకల్లోలాలపై శ్రీధర్ ధర్మాసనం ‘షేమ్’ అనే డాక్యుమెంటరీ తీశారు. నిజామాబాద్ జిల్లాలోని జోగిని వ్యవస్థతోపాటు కూనవరం వద్ద గోదావరి నదిపై అవేర్ అనే సంస్థ నిర్వహిస్తున్న బోట్ హాస్పిటల్, కాకినాడ దగ్గర సముద్రంలో మత్స్యకారుల పిల్లల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న బోట్ స్కూల్ వంటివాటిపై శ్రీధర్ ధర్మాసనం రూపొందించిన లఘు చిత్రాలు ముంబై, ఢాకా, తిరువనంతపురంలలో జరిగిన అంతర్జాతీయ చిత్ర ప్రదర్శనల్లో అవార్డులను పొందాయి.

తెలంగాణ ఉద్యమంలో..

శ్రీధర్ ధర్మాసనం తొలిసారి ‘మేరే షహర్ కో సలాం’ అనే బుక్ రాశారు. తర్వాత ‘మా హైదరాబాద్’ అనే రెండో పుస్తకాన్ని రచించారు. ‘మా హైదరాబాద్’ పేరుతో ఒక వెబ్ సైట్ ని ప్రారంభించి దానికి ఎడిటర్ గా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. ఆ పోరుపై పుస్తకాలను వెలువరించారు. డిజిటల్ మీడియాకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కోసం విశేషంగా కృషి చేశారు. తెలంగాణ ఆన్ లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(టీఓఎండబ్ల్యూజేఏ)కి ప్రెసిడెంట్ గా ఎంతో మందికి మార్గదర్శనం చేస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

Advertisement