Sonia Gandhi Announced Six Guarantees : తెలంగాణ ప్రజలపై సోనియమ్మ వరాల జల్లు.. ఆరు గ్యారంటీలు ప్రకటన..
NQ Staff - September 17, 2023 / 07:46 PM IST

Sonia Gandhi Announced Six Guarantees :
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది.అందులో భాగంగా ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటుచేసింది. దీనికి రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సభకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ హాజరయ్యారు.ఈ సందర్భంగా సోనియాగాంధీ తెలంగాణ ప్రజానీకంపై వరాల జల్లు కురిపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రధానంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.
అందుకోసం తప్పనిసరిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఇక దేశంలోనే తెలంగాణను అత్యుత్తమ స్థానంలో నిలబెడతామన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను ప్రజలు దీవించాలని పిలుపునిచ్చారు.
సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ప్రధానంగా రైతులు, మహిళలకు భారీగా లబ్ది చేకూరే అవకాశముంది. ఎలాంటి హామీలతో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అలాంటి హామీలను తెలంగాణలోనూ అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. అందులో ముఖ్యమైన హామీల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..మొదటిది ‘మహాలక్ష్మి స్కీమ్’ ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ప్రతినెలా రూ.2,000 ఆర్థికసాయంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. అదేవిధంగా రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ అందించనున్నారు.
రెండోవది ‘రైతుభరోసా’ పథకం ద్వారా రైతులు,కౌలు రైతులకు ఏటా రూ.15వేలను పంట పెట్టుబడి సాయంగా ఇవ్వనున్నారు. అలాగే వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.12వేల సాయం.వరి పంట వేస్తే క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించారు. మూడోవది ‘గృహజ్యోతి’ కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వనున్నారు.
నాలుగోవది ‘ఇందిరమ్మ ఇండ్లు’ తమ సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం. ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల స్థలం ఇస్తామన్నారు.ఐదవది ‘యువ వికాసం’ కింద విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభిస్తామన్నారు. చివరగా ఆరోవది ‘చేయూత’ స్కీం ద్వారా ప్రతినెలా రూ.4వేల చొప్పున పెన్షన్.రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా కల్పించనున్నారు.