Pawan Kalyan : టీడీపీతో పవన్ పొత్తుల గురించి మాట్లాడితే అప్పుడు స్పందిస్తాం
NQ Staff - March 15, 2023 / 06:10 PM IST

Pawan Kalyan : తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ 10వ ఆవిర్భావ సభ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను బట్టి టీడీపీతో పొత్తకు ప్రయత్నాలు చేస్తున్నారని అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడు అంటే తనకు గౌరవం అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కొందరు ఈ సందర్భంగా ప్రధానంగా చర్చిస్తున్నారు. ఒక వైపు బిజెపితో పొత్తులో ఉన్న జనసేన మరో వైపు తెలుగుదేశం పార్టీతో కూడా కలుసుకోవాలని ఆశ పడుతుందని దీంతో మళ్ళీ నిరూపితమైంది.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ టీడీపీతో జనసేన పొత్తు గురించి పవన్ కళ్యాణ్ స్పష్టత ఇవ్వలేదు. కనుక ఇప్పటి వరకు జనసేనతో మేము పొత్తులో ఉన్నామని పేర్కొన్నారు. ఒక వేళ టీడీపీతో పవన్ పొత్తుల గురించి మాట్లాడితే అప్పుడు మేము స్పందిస్తామని ఆయన పేర్కొన్నారు.
తమకు జనసేన పార్టీ మిత్రపక్షమని వచ్చే ఎన్నికల్లో కలిసి పని చేస్తామని సోము వీర్రాజు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసే ప్రసక్తి లేదని ఆయన గతంలో పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.