Snake: నాగుపాముని ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న పిల్లి.. ఫొటో హ‌ల్ చ‌ల్‌

Snake: ఇప్పుడు ప్ర‌తి ఇంట్లో పెంపుడు జంతువులు కామ‌న్‌గా ఉంటున్నాయి. పేద వారింట్లో అయితే పిల్లులు, కుక్క‌లు, కోళ్లు ఉంటాయి. అదే బాగా డ‌బ్బున్న వారింట్లో అయితే బ్రీడ్ జాతికి చెందిన కుక్క‌లు, పిల్లులు ఉంటున్నాయి. ఈ పెంపుడు జంతువులు య‌జ‌మానికి సంర‌క్ష‌ణ‌గా ఉంటున్నాయి. గ‌తంలో పెంపుడు జంతువులు ఇంట్లోకి దొంగ‌ల‌ని రానివ్వ‌కుండా అడ్డుకున్న ఘ‌ట‌న‌లు చాలానే చూశాం.

తాజాగా ఓ నాగుపాము ఇంట్లోకి ప్ర‌వేశించే ప్ర‌య‌త్నం చేయ‌గా, దానిని స‌మ‌ర్ద‌వంతంగా అడ్డుకుంది పెంపుడు పిల్లి. దాదాపు 30 నిమిషాల పాటు పిల్లి, పాము మ‌ధ్య పోరాటం సాగ‌గా, చివ‌రికి పాము తోక ముడిచి వెళ్లిపోయింది. య‌జ‌మాని కుటుంబాన్ని కాపాడేందుకు పిల్లి చేసిన సాహ‌సంపై నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఒడిశాలోని భువ‌నేశ్వ‌ర్‌లో ఈ ఘట‌న జ‌ర‌గ‌గా, ఇది ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. బీమ‌తాంగి ప్రాంతంలో ఉన్న సంప‌ద్ కుమార్ ఇంటి పెర‌ట్లోకి నాగు పాము ప్ర‌వేశించింది. అయితే ఇంటి వెనుక నుంచి వ‌స్తున్న ఆ పామును గుర్తించిన పెంపుడు పిల్లి చిన్నూ దాన్ని పెర‌ట్లోనే అడ్డుకున్న‌ది. చిన్నూ అడ్డుగా నిల‌వ‌డంతో.. ఆ స‌ర్పం ప‌దే ప‌దే బుస‌లు కొట్టింది. అయినా క‌ద‌ల‌కుండా చిన్నూ.. ఆ విష‌నాగుకు ఎదురు తిరిగింది.

అయితే ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన ఇంటి య‌జ‌మాని వెంట‌నే స్నేక్ హెల్ప్ లైన్‌కు కాల్ చేశాడు. అరుణ్ కుమార్ అనే వాల‌టీర్ ఇంటికి వ‌చ్చి స‌ర్పాన్ని ప‌ట్టుకొని దూరంగా ఉన్న అట‌వీ ప్ర‌దేశంలో వ‌దిలేశాడు. అయితే స్నేక్ వాలంటీర్ వ‌చ్చే వ‌ర‌కు పాముని పిల్లి అడ్డుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే రెండింటి మ‌ధ్య దాడి జ‌రిగిన స‌మ‌యంలో.. పిల్లికి ఏదైనా కాటు ప‌డిందేమో తెలుసుకునేందుకు దానికి ప‌రీక్ష‌లు చేశారు. కానీ చిన్నూ సుర‌క్షితంగా ఉన్న‌ట్లు స్నేక్ హెల్ప్‌లైన్ అధికారులు చెప్పారు.