YS Sharmila: ఫ్లాష్.. ఫ్లాష్.. : వైఎస్ షర్మిలతో సానియా మీర్జా సోదరి దంపతుల భేటీ

Ys Sharmila తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సర్వం సిద్ధమవుతున్న వైఎస్ షర్మిలకి రోజురోజుకీ వివిధ వర్గాల నుంచి సపోర్ట్ లభిస్తోంది. పలువురు ప్రముఖులు ఆమెను కలుస్తూ మద్దతు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ శుక్రవారం మధ్యాహ్నం టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా దంపతులు వైఎస్ షర్మిలతో సమావేశమయ్యారు. ఆనం మీర్జా టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కుమారుడు మహ్మద్ అసదుద్దీన్ ని 2019 డిసెంబర్ లో రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

తండ్రి కాంగ్రెస్ లో..

తండ్రి అజారుద్దీన్ మాదిరిగానే అసదుద్దీన్ కూడా క్రికెటర్. కానీ పెద్దగా నిలదొక్కుకోలేకపోయాడు. రంజీ మ్యాచ్ ల స్థాయిలోనే ఆగిపోయాడు. ఆల్ రౌండర్ గా మంచి పేరున్న అసదుద్దీన్ ఐపీఎల్ లో కూడా ప్రయత్నించాడు. అయినా ఛాన్స్ రాలేదు. అజారుద్దీన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గతంలో ఈ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తెలంగాణలోని అధికార పార్టీ టీఆరెస్ తెర వెనక మద్దతుతో నెగ్గారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు సతీసమేతంగా షర్మిలని కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది.

యువతకు పెద్ద పీట..

వైఎస్ షర్మిల పెట్టబోయే పొలిటికల్ పార్టీలో కుర్రకారుకి పెద్ద పీట వేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో వివిధ పార్టీల్లో తాత్కాలికంగా ఉండి కొత్త పార్టీ రాగానే అలవాటు ప్రకారం మారే వాళ్ల కన్నా కొత్తవాళ్లయితే (అందునా యూత్ అయితే) ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. షర్మిల కూడా యువ నాయకురాలే కాబట్టి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చేవారికి, ఆమెకి మధ్య ర్యాపో బాగా డెవలప్ అవుతుందని అంటున్నారు. యంగ్ పీపుల్ ఉత్సాహంగా, ఉల్లాసంగా పని చేస్తారు. నూతన ఆలోచనలకి, ఆచరణలకి శ్రీకారం చుడతారు. పార్టీకి పదికాలాల పాటు వివిధ స్థాయిల్లో నాయకత్వం వహిస్తారు. యువత తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదనే సంగతి ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. ఈ క్రమంలోనే షర్మిల సానియా మీర్జా సోదరి దంపతులను తన పార్టీలోకి ఆహ్వానించే సూచనలున్నాయని చెబుతున్నారు. తద్వారా క్రీడాకారుల అభిమానం కూడా పొందాలని ఆమె ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement