నిమ్మగడ్డ vs జగన్ కాస్త సజ్జల vs పట్టాభి అయ్యింది !

ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే, సీఎం జగన్ మరియు ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య నెలకొన్న విభేదాలు మూలంగా అనేక మలుపులు తిరిగి చివరికి నిమ్మగడ్డ వాదన నెగ్గి, రాష్ట్రంలో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ పడింది. అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలని భావిస్తున్న అధికార వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలను ఎకగ్రీవాలు చేసే దిశగా అడుగులు వేయాలని ఇచ్చిన జీవోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రాజకీయంగా ఈ అంశం హాట్ టాపిక్ అయింది. ఇక ఇదిలా ఉంటే… టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడిన తీరు చూస్తుంటే, వైసీపీ తనకు అచ్చివచ్చిన హింసాయుత పంథాలోనే బలవంతపు ఏకగ్రీవాలకు సిద్ధమవుతున్నట్లుగా స్పష్టమైంది అని అన్నారు.

pattabhi tdppattabhi tdp

 

కరోనాకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బలవంతపు ఏకగ్రీవాలు జరిగినట్లు టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు . తాజాగా పట్టాభి కూడా వాటినే వల్లె వేస్తూ “గతంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పుడు, సొంత పార్టీ అండతో వైసీపీ రౌడీమూకలు బలవంతపు ఏకగ్రీవాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా బరి తెగించాయి అని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,696 ఎంపీటీసీలుంటే, వాటిలో 2,362 ఎంపీటీసీలను బలవంతంగా ఏకగ్రీవం చేశారు అని ఆరోపించారు. అందు కోసం అధికార యంత్రాంగాన్ని, వైసీపీ గూండాలను, మారణాయుధాలను వినియోగించడానికి కూడా వైసీపీ వెనుకాడలేదని ఆయన ఆరోపణలు చేశారు. మహిళలు, వృద్ధులని కూడా చూడకుండా ప్రతిజిల్లాలో ఇష్టానుసారం దాడికి పాల్పడ్డారు” అని అన్నారు.

సజ్జల వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొని ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కోరుతున్నాను అన్నారు. హింసాయుతంగా, బెదిరింపులతో వైసీపీ బలవంతపు ఏకగ్రీవాలకు సిద్ధమైతే టీడీపీ చూస్తూ ఊరుకోదని స్ఫష్టం చేస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో గుర్తులతో పనిలేకపోయినా, టీడీపీ సానుభూతిపరులు, కార్యకర్తలు ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నారని సజ్జల తెలుసుకోవాలి అని సూచించారు. వైసీపీ రౌడీమూకలను అడ్డు పెట్టుకొని బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడాలని చూస్తే, ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరిస్తున్నాను అన్నారు.సజ్జల తిరిగి ఏకగ్రీవాలు చేయిస్తామని చెప్పడం ద్వారా అదే పద్థతిని అనుసరించాలని చూస్తున్నట్లు ఆయన మాటలతో అర్థమైంది అన్నారు. సజ్జల వ్యాఖ్యలపై ఎన్నికల కమిషనర్ స్పందించి, కేంద్రబలగాల సాయంతో పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement