Sai Dharam Tej: మెగా హీరో సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్..!

Sai Dharam Tej: మెగా ఫ్యామిలీ నుండి ఏ హీరో వ‌చ్చినా కూడా వారి సినిమాల‌కు అభిమానుల‌లో సూప‌ర్ క్రేజ్ ఉంటుంది. ఇటీవ‌ల ఉప్పెన సినిమాతో సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణవ్ తేజ్ వెండితెర ఎంట్రీ ఇవ్వగా, ఈ సినిమా కూడా ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదం అందించింది. ఇక ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలో త‌మ‌దైన స్టైల్‌లో సినిమాలు చేస్తూ మెగా హీరోలు దూసుకుపోతున్నారు. రేయ్ సినిమాతో హీరోగా మొదలుపెట్టిన సాయిధరమ్ తేజ్ కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను సొంతం చేసుకోగా ఆ తరువాత మాత్రం వరుస ఫ్లాపులతో చతికిలపడ్డారు. చిత్ర‌ల‌హ‌రి, ప్ర‌తి రోజూ పండ‌గే, సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ సినిమాలు తేజూకి మ‌ళ్లీ ఉత్తేజాన్ని అందించాయి. ఇప్పుడు అదే జోష్‌తో దేవ్ క‌ట్టా డైరెక్ష‌న్‌లో రిప‌బ్లిక్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఐశ్వర్యా రాజేష్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Sai Dharam Tej

కరోనా వ‌ల‌న సినిమా రిలీజ్ విషయంలో చాలా మార్పులు వ‌చ్చాయి. ఒక‌ప్పుడు థియేట‌ర్‌లో విడుద‌లైన సినిమాలు ఇప్పుడు ఓటీటీలో విడుద‌ల అవుతున్నాయి. పేపర్ వ్యూ పద్ధతిలో స్టార్ హీరో సినిమాలు విడుద‌ల అవుతుండ‌డం ఇప్పుడు ఆస‌క్తిని క‌లిగిస్తుంది. రిప‌బ్లిక్ చిత్రాన్ని థియేట‌ర్‌లో విడుద‌ల చేస్తున్నార‌ని కొంద‌రు అంటుండ‌గా, మ‌రి కొంద‌రు ఓటీటీలో విడుద‌ల చేస్తార‌ని చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని దక్కించుకోవడానికి జీ5 సంస్థ భారీ అమౌంట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాకు గాను దాదాపు 40 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లు సమాచారం.

డిజిటల్ హక్కులు, శాటిలైట్ హక్కులు, డబ్బింగ్ హక్కులతో పాటు థియేట్రికల్ హక్కులు మొత్తానికి క‌లిపి 40 కోట్ల రూపాయ‌లు ఆఫ‌ర్ చేసిన‌ట్టు స‌మాచారం. సాయిధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ హక్కులు కూడా జీ స్టూడియోస్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ వార్త‌లు నిజ‌మైతే సాయిధ‌ర‌మ్ తేజ్ మూవీ నిర్మాత‌ల‌కు భారీగా లాభాలు వ‌చ్చిన‌ట్టే అంటున్నారు. కేవలం 64 రోజుల్లో ఎలాంటి కరోనా కేసులు లేకుండా సినిమా షూటింగ్ పూర్తి కాగా, ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదాన్ని అందిస్తుంద‌ని అంటున్నారు.