SACHIN భారతదేశంలో కరోనా మహమ్మారి బుసలు కొడుతుంది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి ప్రకంపనలు పుట్టించింది. కరోనా ధాటికి చాలా మంది బలయ్యారు. ఈ ఏడాది కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గినట్టు అనిపించి అంతా ఊపిరి పీల్చుకున్నారు. రవాణా వ్యవస్థ ప్రారంభం కావడం, క్రికెట్ స్టేడియాలలో జనాలు ప్రత్యక్షం కావడం, థియేటర్స్ తిరిగి తెరుచుకోవడం వలన వైరస్ వ్యాప్తి మళ్లీ పెరిగింది. ప్రతి రోజు దేశ వ్యాప్తంగా 50 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయంటే కరోనా మహమ్మారి విజృంభణ ఏ విధంగా సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం అందరిలో వణుకు పుట్టిస్తుంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. టీకా వేయించుకున్న వాళ్లకు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవుతుంది. తాజాగా లింగం మామ పరేష్ రావల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇక తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ మధ్య కాలంలో తరచు కరోనా టెస్ట్ చేయించుకుంటున్నాను. కోవిడ్‌కు దూరంగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. తాజాగా నిర్వహించిన టెస్టింగ్‌లో కరోనా పాజిటివ్ వచ్చిందని సచిన్ పేర్కొన్నాడు.
తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని చెప్పిన సచిన్.. మా ఇంట్లో అందరికి కరోనా నెగెటివ్ వచ్చింది. నాకు మాత్రమే పాజిటివ్ అని తేలింది. ఇంట్లో క్వారంటైన్లో ఉంటూ వైద్యులు చెప్పిన సూచనలు పాటిస్తూ చికిత్స పొందుతున్నాను అని మేటి క్రికెటర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. తనతో పాటు, దేశంలోని అనేక మందికి మద్దతు ఇస్తున్న హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్‌కు థ్యాంక్స్ చెబుతున్నానని సచిన్ తన ట్వీట్లో తెలిపారు. కాగా, రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టీ20 క్రికెట్ టోర్నీ కప్‌లో భాగంగా రిటైర్డ్ క్రికెటర్లతో టోర్నీ నిర్వహించగా, భారత్ కు చెందిన లెజెండ్స్ జట్టు సచిన్ నేతృత్వంలో మ్యాచ్‌లు ఆడింది. ఈ జట్టు ఛాంపియన్ గా నిలిచి అందరిని ఆనందింపజేసింది.టోర్నీ సమయంలోనే సచిన్ కరోనా బారిన పడి ఉంటారని అర్ధమవుతుంది.