Rythubandhu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతుబంధు డబ్బులు రెడీ..

Rythubandhu : తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ శనివారం శుభవార్త చెప్పింది. వచ్చే నెల అంటే జూన్ 15వ తేదీ నుంచి రైతుబంధు డబ్బులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 15వ తేదీ నుంచి 25వ తేదీ లోపు పది రోజుల్లో అందరికీ ఈ ఆర్థిక సాయాన్ని వాళ్ల బ్యాంకు ఖాతాల్లో వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఈరోజు వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. ‘పార్ట్-బీ’ నుంచి ‘పార్ట్-ఏ’లోకి చేరిన రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. జూన్ 10వ తేదీ లోపు పేర్లు నమోదు చేయించుకున్న ప్రతిఒక్కరికీ డబ్బులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ గవర్నమెంట్.. రైతులకు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఏడాదికి రెండు సార్లు పంట పెట్టుబడి సాయం చేస్తున్న సంగతి తెలిసిందే.

rythubandhu-rythubandhu-amout-will-credit-from-june-15th
rythubandhu-rythubandhu-amout-will-credit-from-june-15th

అదే మా ధ్యేయం.. లక్ష్యం..

కరోనా వచ్చినా.. మరే మహమ్మారి వచ్చినా.. ఏదేమైనా.. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి పూర్వ వైభవం తేవాలనేదే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. స్థిర ఆదాయం వచ్చేలా ఈ రంగాన్ని తీర్చిదిద్దాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. మిషన్ కాకతీయతోపాటు ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించి తెలంగాణను కోటి ఎకరాల మాగాణలాగా చేయటంలో సక్సెస్ అయ్యామని చెప్పారు. ఎవరెన్ని అడ్డంకులు తెచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు.

కల్తీ చేస్తే.. క్లోజ్ చేయండి : Rythubandhu

జూన్ నుంచి తెలంగాణలో మొదటి పంట సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సాగుబడికి సంబంధించిన సూచనలు, సలహాలు, ఆదేశాలిచ్చారు. క్వాలిటీ కలిగిన విత్తనాలనే కర్షకులకు అందజేయాలని, కల్తీలకు పాల్పడేవారి ఆటలను కట్టిపెట్టాలని చెప్పారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు, దాడులు చేపట్టాలని అన్నారు. మోసగాళ్ల ముందరి కాళ్లకు బంధాలు వేయాలని, నకిలీ విత్తనాలను విక్రయించే ముఠాలను పట్టుకున్న ఆఫీసర్లకు, పోలీసులకు ప్రోత్సాహకాలను కూడా అందజేయాలని సూచించారు. తప్పుచేసినవారు ఎంతటివారైనా విడిచిపెట్టొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు.