ఆగష్టు 12 వ తేదీన రష్యా కరోనా వ్యాక్సిన్ విడుదల
Admin - July 31, 2020 / 10:50 AM IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ఒకవైపు ఈ మహమ్మారిని అరికట్టడానికి ప్రపంచ దేశాలు అన్నీ కూడా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. అయితే ఇదే తరుణంలో ప్రపంచానికి రష్యా శుభవార్త తెలిపింది. ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ తీసుకొచ్చేది తామేనంటూ రష్యా మరోసారి ప్రకటన చేసింది. కరోనా వ్యాక్సిన్ ను ఆగస్టు 12వ తేదీలోగా విడుదల చేయనున్నట్లు రష్యా చెపుతుంది. రష్యాకు చెందిన “గామాలెయ ఇన్ స్టిట్యూట్ రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్” సంస్థ ఈ వ్యాక్సిన్ ను రూపొందిస్తుంది.
డ్రగ్ రెగ్యూలేటర్ల నుండి అనుమతి లభిస్తే సాధ్యమైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్ ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ‘బ్లూమ్ బర్గ్’ ఒక కథనాన్ని రాసింది. అలాగే రష్యాలోనే మరో వ్యాక్సిన్ కు మానవ ప్రయోగాల దశ ప్రారంభమైందని కూడా వివరించింది. జూలై 27వ తేదీన ఐదుగురు వాలంటీర్ల పై ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించారని వారు అందరు ఎలాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోలేదని తెలిపింది. మరోక వైపు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ రూపొందిస్తున్న వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసేందుకు ఆస్ట్రాజెనెకాతో రష్యాకు చెందిన ఆర్ ఫార్మా ఒప్పందం చేసుకుంది.
ఒకవైపు రష్యా భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. అలాగే రష్యా వ్యాక్సిన్ కు రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాలేదని, ప్రపంచ వ్యాప్తంగా మిగిత ప్రయోగాలు రష్యా కంటే ముందంజలో ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అలాగే కొంతమంది నిపుణులు రష్యా ట్రయల్స్ పూర్తి చేయకముందే మార్కెట్లోకి వ్యాక్సిన్ వస్తుందని చెప్పడం ఆందోళనకరంగా ఉందని అంటున్నారు.