Bandi Sanjay: బండీ.. ఇదేమైనా దేశ ద్రోహమా?..

Bandi Sanjay తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేసిన అసత్య వ్యాఖ్యల పట్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచీ తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. బీజేపీ ఒక మనువాద పార్టీ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ప్రవీణ్ కుమార్ పై కమలం పార్టీ నాయకులు మాటల దాడులు ఆపాలని హితవు పలికారు. కరీంనగర్ ఎంపీ కూడా అయిన బండి సంజయ్ తెలివి తక్కువ తనంతో ప్రవీణ్ కుమార్ పై అవాకులు చెవాకులు పేలుతున్నారని పొన్నం ఎద్దేవా చేశారు. దళితులు బాగా చదువుకోవటం కాషాయం పార్టీ నేతలకు ఇష్టంలేదని చెప్పారు. బీజేపీ లీడర్ల తీరును ఎస్సీలంతా ఖండించాలని కోరారు. హిందూ దేవుళ్లను ఆరాధించకపోతే అదేమైనా దేశ ద్రోహం అవుతుందా అని పొన్నం ప్రభాకర్ నిలదీశారు. ఈ మేరకు ఆయన ఇవాళ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీడియాతో మాట్లాడారు.

ఫండ్స్ ఇస్తోంది మేమే..

ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో విజయవంతంగా నడుస్తున్న స్వేరోస్ నెట్వర్క్ కి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?. ఆ లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం తీస్తుందా? లేక, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలా? అంటూ బండి సంజయ్ బెదిరింపు ధోరణిలో మాట్లాడటాన్ని తెలంగాణ బహుజన డాక్టర్స్ ఫోరం ఖండించింది. ఆ సంస్థకు డబ్బులు ఇస్తోంది తామేనని వాళ్లు స్పష్టం చేశారు. మేం ఏటా సంపాదించే దాంట్లో ఓ పది శాతం స్వేరోస్ నెట్వర్క్ కి కేటాయిస్తున్నామని చెప్పారు. స్వేరోస్ సంస్థ ఏ దేవుడికీ, ఏ కులానికీ వ్యతిరేకం కాదని తేల్చిచెప్పారు.

మత కలహాలకు కుట్ర..

తెలంగాణలో కొంత మంది మత కలహాలు రేపేందుకు కుట్ర పన్నుతున్నారని డాక్టర్స్ ఫోరం ఆరోపించింది. ఈ పథకంలో భాగంగా ప్రవీణ్ కుమార్ పైన, స్వేరోస్ నెట్వర్క్ పైన అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, అనుచితంగా ప్రవర్తిస్తున్నారని తప్పుపట్టారు. ‘‘కరీంనగర్ జిల్లా ధూళికట్టలో ఇటీవల జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ప్రవీణ్ కుమార్ వెళ్లారు. అక్కడ జరిగిన ప్రేయర్ లో పాల్గొన్నారు. కానీ ఆ ప్రోగ్రామ్ కి, ఆయనకి ఏం సంబంధంలేదు. ఆ సంగతి ఆయనే స్వయంగా చెప్పారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియాల్లోనూ అదే స్పష్టంగా ఉంది’’ అని డాక్టర్స్ ఫోరం ప్రతినిధులు పేర్కొన్నారు.

Advertisement