RRR: సామాజిక సేవలో #RRR Movie టీమ్

RRR: ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ సామాజిక సేవలో నిమగ్నమైంది. కరోనా బాధితులకు కావాల్సిన సాయాన్ని స్వయంగా, డైరెక్టుగా ఇవ్వకపోయినా తక్షణం అందేలా సాంకేతిక సహకారం చేస్తోంది. బాధితులకు, సేవకులకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తోంది. ఈ మేరకు ఆర్ఆర్ఆర్ మూవీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అవగాహన కల్పిస్తోంది. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి అని సూచిస్తోంది. ‘‘కొవిడ్-19 లక్షణాలు కనిపిస్తే చాలు. కరోనా పరీక్ష చేయించుకోవటానికి ఇప్పటికీ చాలా మంది ఆందోళన చెందుతుండటం, భయపడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలాంటివాళ్లే చివరికి ఆస్పత్రిపాలు అవుతున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కి గురవుతున్నారు. కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, మున్సిపాలిటీల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఎవరూ నిర్లక్ష్యంగా ఉండకండి. ఈ జబ్బుని చూసి జడుసుకోవద్దు. రోగం పైనా, టీకా పైన అవగాహన పెంచుకోవాలి. వ్యాక్సిన్ వేయించుకోవాలి’’ అని ఆర్ఆర్ఆర్ టీమ్ ఒక ట్వీట్ లో పేర్కొంది.

ముందుకొచ్చిన మరిన్ని సంస్థలు..

ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ తోపాటు పలు సినీ నిర్మాణ సంస్థలు కూడా ఇదే తరహా సర్వీస్ ని అందిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్, హారికాహాసిని తదితర కంపెనీలు సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్నాయి. ప్లాస్మా అవసరం అని ఎవరైనా ట్వీట్ చేస్తే దాన్ని రీట్వీట్ చేయటం, ప్రాణవాయువు కావాలి అనే పోస్ట్ కనిపిస్తే దాన్ని షేర్ చేయటం వంటివి చేస్తున్నాయి.

‘మైత్రీ’.. మంచి ఐడియా..

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సరికొత్త ఆలోచనను అమల్లోకి తెచ్చింది. కరోనా వేళ అవసరమైన రిక్వెస్టులకు ఈజీగా రియాక్షన్ వచ్చేందుకు హ్యాష్ ట్యాగ్ లను తయారుచేసి ట్వీట్ చేసింది. ట్వీట్లు చేసేవాళ్లు ఆయా హ్యాష్ ట్యాగుల్లో తమ ప్రాంతం పేరును కూడా పేర్కొనాలని సూచిస్తోంది. హైదరాబాద్ వాళ్లు ‘కొవిడ్19హైదరాబాద్’ అని, విశాఖపట్నంవాళ్లు ‘కొవిడ్19వైజాగ్’ అని క్లియర్ గా రాస్తే వెంటనే స్పందన వచ్చేలా చూస్తోంది. కరోనా వల్ల సినిమా పరిశ్రమ కూడా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితుల్లో ఆయా సంస్థలు నేరుగా ఆర్థిక సాయం గానీ, వస్తు సాయం గానీ చేయకపోయినా మేధోపరమైన ఇలాంటి హెల్ప్ చేసినా కొంత మంది ప్రాణాలనైనా కాపాడినట్లవుతోంది.

 

Advertisement