ప్రముఖ ఫోక్ సింగర్ వంగపండు ప్రసాద్ రావు మృతి
Admin - August 4, 2020 / 07:04 AM IST

ప్రముఖ ఫోక్ సింగర్ వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఈరోజు తెల్లవారుజామున విజయనగరం జిల్లా పార్వతీపురంలోని తన నివాసంలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. వంగపండు ప్రసాదరావు వందలాది జానపద పాటలను రచించారు. అలాగే కొన్ని పాటలు కూడా పాడారు. తన పాటలతో పల్లెకారులతో పాటు, గిరిజనులకు కూడా అవగాహన కల్పించిన ప్రసాదరావు ఉత్తరాంధ్ర వెనుకబాటు గురించి గొంతెత్తి పాడారు.
మొత్తానికి 300లకు పైగా పాటలు రాశారు. అలాగే ఆయన రాసిన చాలా పాటలను సినిమాల్లోకి కూడా తీసుకున్నారు. ముఖ్యంగా ఆయన రాసిన ‘ఏం పిల్లడో ఎళ్ద మొస్తావా’ అనే పాట భారతదేశంలోని అన్ని భాషల్లోనూ ఉంది. చీమల దండు, రైతాంగ పోరాటం, భూమి పోరాటం వంటి సినిమాలకు ప్రసాదరావు పాటలు రాశారు. ఆయన మరణ వార్త విన్న తెలుగు రాష్ట్రాల్లోని ఇతర జానపద కళాకారులు, ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.