న‌లుగురు పిల్ల‌ల‌కు విషం ఇచ్చి ఆత్మ‌హ‌త్య చేసుకున్న రిటైర్డ్ జ‌వాన్

ఎంతో అమూల్య‌మైన జీవితాన్ని చిన్న చిన్న కార‌ణాల‌కు నాశ‌నం చేసుకుంటున్నారు. ఎవ‌రో ఏదో అన్నార‌ని, లేదంటే పెళ్లం పుట్టింటికి వెళ్లింద‌నో ఇలా ప‌లు ర‌కాల కార‌ణాలు వెతుక్కుంటూ త‌నువు చాలిస్తున్నారు. తాజ‌గా నలుగురు పిల్లలకు విషమిచ్చి చివరకు తానుకూడా అదే విషం తాగి ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

క‌ర్ణాట‌లోని బెళగావి జిల్లా బోరగల్ గ్రామానికి చెందిన గోపాల్‌ హాదిమని (48), జయ(42) భార్యాభర్తలు. వీరికి సౌమ్య(19), శ్వేత(16), సాక్షి(11), సృజన్ (8) సంతానం. గోపాల్ భారత సైన్యంలో పనిచచేసి ఇటీవలే రిటైరయ్యాడు. క‌రోనా సెకండ్ వేవ్ స‌మ‌యంలో జ‌య క‌రోనా బారిన ప‌డింది .

బ్లాక్ ఫంగ‌స్‌తో బాధపడుతూ కొన్నిరోజులు చికిత్స పొందిన ఆమె ఏడాది జూలై నెలలో మరణించింది. అప్పటినుండి భర్త గోపాల్ తో పాటు పిల్లలు కూడా తీవ్ర మనోవేధనతో బ్రతుకుతున్నారు. భార్యలేమితో తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిన గోపాల్ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం రాత్రి నలుగురు పిల్లలకు విషమిచ్చి అదే విషాన్ని తానుకూడా తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

శనివారం ఉదయం ఇంటి తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారు చూడగా తండ్రీ పిల్లలు మృతిచెంది వున్నారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘ‌టనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఐదుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఒకేసారి తండ్రీ, నలుగురు పిల్లలు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. ఈ ఆత్మహత్యలపై మంత్రి గోవింద కారజోళ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.