Renu Desai: పనికి మాలిన మెసేజ్ లు పెట్టొద్దంటూ నెటిజన్లపై మండిపడ్డ రేణూ దేశాయ్
Kondala Rao - May 18, 2021 / 08:19 PM IST

Renu Desai: నటి రేణూదేశాయ్ నెటిజన్లపై మండిపడ్డారు. ఇన్ స్టాగ్రామ్ లో తనకు హాయ్, హలో అనే పనికి మాలిన, టైం పాస్ మెసేజ్ లు పెట్టొద్దంటూ రిక్వెస్ట్ చేశారు. ఇలాంటి సరదా సందేశాల వల్ల తనతో అత్యవసరం ఉన్నవాళ్లకు సకాలంలో సాయం అందట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లెక్కలేనన్ని అనవసరమైన మెసేజ్ ల వల్ల తన ఇన్ బాక్స్ నిండిపోతోందని, వాటిని చెక్ చేయటానికే గంటలు గంటలు విలువైన సమయం వేస్ట్ అవుతోందని ఆగ్రహం వెలిబుచ్చారు. మీరు సాయం చేయకపోగా సాయం చేసేవాళ్లను చెడగొడుతున్నారంటూ అసహనం ప్రదర్శించారు. సాధ్యమైనంత ఎక్కువ మంది కరోనా బాధితులకు అండగా ఉండాలని తాను తాపత్రయపడుతుంటే ఇలాంటి పనుల వల్ల ఆటంకం కలుగుతోందని రేణూ దేశాయ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు.
డబ్బులడగొద్దు ప్లీజ్
తాను ప్రస్తుతం ఎవరికీ డబ్బులు ఇవ్వట్లేదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో కూడా తెలియట్లేదని రేణూ దేశాయ్ అన్నారు. నిజంగా ప్రాణాపాయ స్థితిలో ఉంటే, ఎమర్జెనీ, క్రిటికల్ అయితే అప్పుడు తనకు చేతనైనంత సాయం చేస్తున్నానని తెలిపారు. గతంలో ఇలాగే చాలా మందికి డబ్బులిచ్చి ఛేదు అనుభవాలను మూటగట్టుకున్నానని గుర్తు చేసుకున్నారు. తన పేరుతో ట్విట్టర్ లో ఉన్న ఖాతా నిజానికి తనది కాదని, దాన్ని ఎవరూ ఫాలో కావొద్దని రేణూ దేశాయ్ సూచించారు.
రోజుకి 14 గంటలు..
కరోనా నేపథ్యంలో తాను ఇప్పటివరకు దాదాపు 600 మందికి ఏదో ఒక రూపంలో సాయం చేశానని రేణూ దేశాయ్ పేర్కొన్నారు. సినిమాలు, షూటింగులు లేకపోవటంతో ఖాళీగా ఉన్నానని, బయటి పరిస్థితులను చూస్తుంటే ఎంతో బాధగా ఉందని చెప్పారు. సమాజానికి తన వంతుగా సాయం చేద్దామనుకుంటున్నానని అన్నారు. కనీసం పది మందికి హెల్ప్ చేసినా చాలనే భావనతో ఉన్నానని, వివిధ ప్రాంతాల్లో తనకు తెలిసినవారి ద్వారా కొవిడ్ బాధితులకు అండగా ఉంటున్నానని వివరించారు. ఈ క్రమంలో రోజుకి 14 గంటలు ఫోన్ మాట్లాడటానికే సరిపోతోందని తెలిపారు. తన ప్రయత్నాలకు కొడుకు అఖీరా, కూతురు ఆద్య కూడా సపోర్ట్ చేస్తున్నారని రేణూ దేశాయ్ చెప్పారు.