Nara Lokesh : లోకేష్ ‘యువగళం’ కోసం డీజీపీకి రిమైండర్ లేఖ
NQ Staff - January 20, 2023 / 07:29 PM IST

Nara Lokesh : తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్త పాద యాత్రకు శ్రీకారం చుట్టబోతున్న విషయం తెలిసిందే. యువగళం పేరిట 400 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల మేరకు లోకేష్ పాదయాత్ర సాగనుంది.
లోకేష్ పాదయాత్ర కోసం ఇప్పటికే తెలుగు దేశం పార్టీ ముఖ్య నేతలు రాష్ట్ర డిజిపి కి లేఖ రాసి అనుమతి కోరిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటి వరకు లోకేష్ యువగళం పాదయాత్రకు ఏపీ పోలీసుల నుండి అనుమతి రాలేదు.
దాంతో మరోసారి తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య రాష్ట్ర డిజిపి కి రిమైండర్ లేఖను పంపించారు. యువగళం పాదయాత్ర సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో త్వరగా అనుమతిలిస్తే ఏర్పాట్లు చేసుకుంటామని లేఖలో వర్ల రామయ్య పేర్కొన్నారు.
అనుమతుల విషయంలో డిజిపి ఆలస్యం చేయడం పట్ల తెలుగు దేశం పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం లోకేష్ యొక్క పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుందని టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు అడ్డుపడ్డా కూడా నారా లోకేష్ యొక్క యువగళం పాదయాత్ర ఆగదు అంటూ తెలుగు తమ్ముళ్లు చాలా నమ్మకంగా చెబుతున్నారు.