RCB: ఆ ఇద్దరు క్రికెట‌ర్స్ చార్ట‌ర్ ఫ్లైట్‌ను లండ‌న్‌కు పంప‌నున్న ఆర్సీబీ

RCB: గ‌త కొద్ది రోజులుగా ఇంగ్లండ్-భార‌త్ మ‌ధ్య ఆస‌క్తిక‌రంగా టెస్ట్ సిరీస్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్‌డ్రా కాగా, రెండ‌వ మ్యాచ్‌లో భార‌త్ గెలుపొందింది. మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ విజ‌యం సాధించింది. ఇక నాలుగో టెస్ట్‌లో మ‌ళ్లీ భార‌త్ విజ‌య‌భేరి మోగించింది. అయితే ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్‌ కరోనా కారణంగా అర్థంతరంగా రద్దయిన సంగతి తెలిసిందే.

RCB arranges charter flight for Kohli, Siraj
RCB arranges charter flight for Kohli, Siraj

దీంతో టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌తో ఆధిక్యంలో ఉంది. ఇక ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో అంచె పోటీలకు వారం సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ఇంగ్లండ్‌ టూర్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు యూఏఈకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో భారత్‌, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ భారత బృందంలోని సభ్యులకు కోవిడ్-19 సోకడంతో ర‌ద్దు చేశారు.


ఈ నేప‌థ్యంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఆ జ‌ట్టు ఆట‌గాడు మహ్మద్‌ సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్‌ ఫ్లైట్‌ను లండన్‌కు పంపించనుంది ఆర్సీబీ టీం. చార్టర్‌ ఫ్లైట్‌లో దుబాయ్‌కి చేరుకోనున్న ఈ ఇద్దరు ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఈ విషయాన్ని ఆర్‌సీబీ ఒక ప్రకటనలో తెలిపింది. కోహ్లి, సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్‌ ఫ్లైట్‌ను సిద్ధం చేశాం. శనివారం రాత్రి కోహ్లి, సిరాజ్‌లు చార్టర్‌ ఫ్లైట్‌ ఎక్కుతారు.. ఆదివారం ఉదయం దుబాయ్‌లో దిగిన వెంటనే నిబంధనల ప్రకారం ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. అంటూ ఆర్‌సీబీ పేర్కొంది.


ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ఆర్‌సీబీ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 5 విజయాలు, రెండు ఓటములతో 10 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం ఆర్‌సీబీ ఫ్రాంచైజీ చరిత్రలో తొలిసారి కావడం విశేషం. ఎన్నో సార్లు టైటిల్‌ని ముద్దాడాల‌ని ఎంత‌గానో ఆశించిన ఆర్సీబీకి నిరాశే మిగిలింది. ఈ సారైన విజ‌యం సాధించాల‌ని భావిస్తుంది.


ఇదిలా ఉంటే ఐదో టెస్టుకు ముందు రోజు గురువారం సాయంత్రం టీమిండియా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్‌‌‌‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే అతడితో పలువురు భారత ఆటగాళ్లు ప్రైమరీ కాంటాక్ట్‌లుగా ఉన్నారని తెలిసింది. దీంతో ఆటగాళ్లందరికీ ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయగా.. నెగెటివ్‌గా తేలింది. అయినా భారత జట్టు ముందు జాగ్రత్త చర్యగా చివరి టెస్టులో ఆడలేమని బీసీసీఐకి లేఖ రాసింది.