IPL-14 Match-19 : రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ దెబ్బతో.. బెంగళూరుకి తొలి ఓటమి..

IPL-14 Match-19 ఐపీఎల్ 14వ సీజన్ లోని 19వ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారిగా ఓడిపోయింది. 20 ఓవర్లు ఆడి 9 వికెట్లు కోల్పోయి 122 రన్నులే చేసింది. దీంతో ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ 69 రన్నుల భారీ తేడాతో సూపర్ విజయాన్ని నమోదు చేసింది. ఈ రెండు జట్లకీ ఇది ఐదో మ్యాచ్. ప్రస్తుతం ఇరు జట్లూ సమాన పాయింట్లతో నిలిచాయి. చెన్నై టీమ్ లోని రవీంద్ర జడేజా ఒకే ఓవర్ లో 37 రన్నులు రాబట్టడంతో చెన్నై జట్టు బెంగళూరు టీమ్ ముందు పెద్ద టార్గెట్ పెట్టగలిగింది. ఫలితంగా 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగళూరు జట్టు ఏ దశలోనూ నిలదొక్కుకోలేదు. రవీంద్ర జడేజా బ్యాట్ తోపాటు బాల్ తోనూ మాయ చేసి బెంగళూరుకి చుక్కలు చూపించాడు. మూడు వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లలో శామ్ కరణ్ 1, శార్దూల్ ఠాకూర్ 1, ఇమ్రాన్ తాహిర్ 2 వికెట్లు పడగొట్టారు.

రెండూ.. రెండే..

పాయింట్ల పట్టికలో ఒకటీ, రెండు స్థానాల్లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఈ రోజు తలపడ్డాయి. టాస్ గెలిచిన చెన్నై ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో మొత్తం నాలుగు మ్యాచ్ లు ఆడి నాలుగూ గెలిచిన బెంగళూరు టీమ్ బౌలింగ్ కి దిగింది. నాలుగు మ్యాచ్ ల్లో మూడు మాత్రమే నెగ్గి ఒకటి ఓడిపోయిన చెన్నై ఈ ఐదో మ్యాచ్ లో బెంగళూరుకి 192 రన్నుల భారీ లక్ష్యాన్నే నిర్దేశించింది. రుతురాజ్ గైక్వాడ్ 33, డూప్లెసిస్ 50 పరుగులతో శుభారంభం చేశారు. సురేష్ రైనా కూడా 24 రన్నులు చేశాడు. తెలుగు బ్యాట్స్ మన్ అంబటి రాయుడు 14 పరుగులు సాధించాడు. రవీంద్ర జడేజా (62), కెప్టెన్ ధోనీ(2) నాటౌట్ గా నిలిచారు.

జడేజా.. సునామీ..

ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కేవలం 28 బంతుల్లోనే 62 రన్నులు చేయటం విశేషం. ఇందులో 5 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. ఈ ఐదు సిక్సులూ, ఒక ఫోర్ ఒకే (లాస్ట్) ఓవర్ లో రావటం గమనార్హం. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 3, యుజ్వేంద్ర ఛాహల్ 1 వికెట్ ని తమ ఖాతాలో వేసుకున్నారు.

Advertisement