Rats:12 వైన్ బాటిల్స్ ఖాళీ చేసిన ఎలుకలు.. విష‌యం తెలుసుకొని ఆశ్చ‌ర్య‌పోయిన అధికారులు

Rats: మ‌నుషుల‌తో పాటు జంతువులు కూడా త‌మ అనువైన స్థ‌లానికి ఎంపిక చేసుకుంటున్నాయి. మాన‌వుల‌ని ఓ ర‌క‌మైన ఇబ్బందికి గురి చేస్తూ దోమ‌లు, ఎలుకలు, కుక్క‌లు, ఈగ‌లు వంటివి మ‌నుగ‌డ సాగిస్తున్నాయి. ఎలుక‌ల బెడ‌ద ఎక్కువ‌గా ఉంటే ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌వుతాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక ఎలుక ఉంది అంటే అవి వంద‌లాది ఎలుకల‌ని పుట్టిస్తాయి. ఎలుక‌ల వల‌న ఇంట్లో ప‌ప్పు,బియ్యం , ధాన్యాలు వంటివి నాశ‌నం కావ‌డం ఖాయం.

ఇక కొన్నిఎలుక‌లైతే బుక్స్ కొరికేయ‌డం, తీగ‌లు కట్ చేయ‌డం వంటివి చేస్తుంటాయి. కాని త‌మిళ‌నాడులోని నీల‌గిరి జిల్లాల‌లోని ఎలుక‌లు స‌రికొత్త రుచిని ఎంచుకున్నాయి. మ‌నుషుల‌కే మ‌ద్యం దొర‌క్క నానా ఇబ్బందులు ప‌డుతున్న స‌మ‌యంలో ఎలుక‌లు వైన్‌ షాప్‌లోకి దూరి ఏకంగా 12 వైన్ బాటిళ్లను ఖాళీ చేశాయి. గుడలూర్ సమీపంలోని కదంపూజాలో ప్రభుత్వం నడుపుతున్న టాస్మాక్ మద్యం దుకాణంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది.

ఇటీవ‌ల క‌రోనా వ‌ల‌న లాక్‌డౌన్ ఏర్పాటు చేయ‌డంతో మ‌ద్యం షాపులు కూడా మూత‌ప‌డ్డాయి. ఆ స‌మ‌యంలో మందు బాబులు ప‌డ్డ క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతం. అయితే ఎలుకలు మాత్రం అదే త‌మ‌కు స‌రైన స‌మ‌యం అనుకొని వైన్ బాటిల్స్ ఖాళీ చేశాయి. కోవిడ్ తగ్గుముఖం పట్టడం వల్ల ప్రభుత్వం ఆంక్షలను సడలించడంతో మద్యం షాపులను ఓపెన్ చేయ‌గా ఈ ఉదంతం వెలుగులోకి వ‌చ్చింది.

వైన్‌ షాప్‌ తెరిచి చూసేసరికి 12 ఖాళీ వైన్ బాటిళ్లు ఒపెన్‌ చేసి ఉండటంతో తమిళనాడు ఎక్సైజ్ సిబ్బంది షాక్‌ తిన్నారు. బాటిళ్ల మూతలపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు ఉండంటంతోపాటు.. అందులోని వైన్ ఖాళీ అయ్యింది. అధికారులు పూర్తి ప‌రిశీల‌న చేయ‌గా, 12 మ‌ద్యం సీసాల మూత‌ల‌ను ఎలుక‌లు గుర్తించిన‌ట్టు అధికారులు గుర్తించారు. లాక్‌డౌన్ వల్ల చాలాకాలం ఈ మద్యం దుకాణం మూసివేయడంతో షాపులో ఎలుకలు తిరగడం ప్రారంభించాయని, బాటిళ్ల మూతలను కొరికి ఎలుకలు మద్యం తాగేశాయని తమిళనాడు ఎక్సైజ్ శాఖ సీనియర్ అధికారి అన్నారు.

ఎలుక‌లు ఖాళీ చేసిన వైన్ విలు దాదాపు రూ. 1500 ఉంటుందని స‌మాచారం. అయితే ఎలుకలు బీర్ లేదా ఇత‌ర మ‌ద్యాన్ని ఏ మాత్రం ముట్టుకోకుండా కేవ‌లం వైన్ బాటిల్స్‌నే టార్గెట్ చేయ‌డంపై అంతా అవాక్క‌వుతున్నారు. ఎలుక‌లు కూడా మందుబాబుల మాదిరిగా మారాయ‌ని నెటిజ‌న్స్ ఫ‌న్నీ కామెంట్స్ పెడుతున్నారు.