Rapaka Varaprasad : దొంగ ఓట్ల కామెంట్లపై స్పందించిన రాపాక.. నేను అలా అనలేదు..!
NQ Staff - March 28, 2023 / 01:12 PM IST

Rapaka Varaprasad : నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన దొంగ ఓట్ల కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అంతర్వేదిలో పార్టీ కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇందులో రాపాక పాల్గొన్నారు.
ఇందులో ఆయన మాట్లాడుతూ గతంలో నా అనుచరులు దొంగ ఓట్లు వేసేవారు. నాకు గతంలో 800 మెజార్టీ కూడా వచ్చింది అంటూ ఆ వీడియోలో ఉంది. దాంతో రాపాక వరప్రసాద్ దొంగ ఓట్లతో గెలిచాడు అంటూ టీడీపీ ఆరోపిస్తోంది. దాంతో ఈ విమర్శల నేపథ్యంలో ఆయన స్పందించాడు.
వీడియో రిలీజ్..
ఆ వీడియో పూర్తి పుటేజీని ఆయన రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. తాను 2019 లో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల గురించి మాట్లాడలేదని తెలిపారు. 32 ఏళ్ల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల గురించి మాట్లాడినట్టు వివరించారు. అయితే ఆ వీడియోలో ఆయన ఎక్కడా కూడా 2019 ఎన్నికలు అని గానీ.. 32 ఏళ్ల క్రితం అని కూడా ఎక్కడా పలకలేదు.
ఆయన రాబోయే ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడే చాలామందికి అనుమానం కలుగుతోంది. ఆయన రాబోయే ఎన్నికల గురించి చెబుతున్నారు తప్ప స్పష్టంగా గత ఎన్నికల గురించి మాట్లాడట్లేదు. దాంతో ఆయన కచ్చితంగా దొంగ ఓట్లతోనే గెలిచి ఉంటారేమో అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.