Ramdev Baba : వివాదాస్పద వ్యాఖ్యలపై మహిళాలోకానికి క్షమాపణ చెప్పిన రాందేవ్ బాబా.!
NQ Staff - November 28, 2022 / 02:12 PM IST

Ramdev Baba : ‘యోగా డ్రస్సు కాకపోతేనేం, చీరలో అయినా బావుంటారు. అసలేమీ లేకపోయినా అందంగా వుంటారు..’ అంటూ మహిళలపై ఇటీవల యోగా గురు రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా రాందేవ్ బాబాపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు చోట్ల రాందేవ్ బాబా మీద కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాందేవ్ బాబా దిగొచ్చారు. మహిళా లోకానికి క్షమాపణ చెప్పారు. మహిళల పట్ల తనకు అపారమైన గౌరవం వుందంటూ పేర్కొన్నారు రాందేవ్ బాబా.
ఆ వ్యాఖ్యలు నేను చేయలేదు గానీ..
బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అసలు తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని ఆయన అంటున్నాడు.
‘కొందరు నాపై దుష్ప్రచారం చేశారు. నేనెప్పుడూ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయను. మహిళలంటే నాకు చాలా చాలా గౌరవం..’ అంటూ చెప్పుకొచ్చిన రాందేవ్ బాబా, తన వ్యాఖ్యల్ని కొందరు వక్రీకరించారంటూ వాపోయారు.
‘నేను ఆ వ్యాఖ్యలు చేయకపోయినా, చేశానంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. అయినాగానీ, మహిళా లోకానికి నేను క్షమాపణ చెబుతున్నాను..’ అంటూ రాందేవ్ బాబా పేర్కొనడం కొసమెరుపు.