Ram: ఇస్మార్ట్ రామ్ కూడా పాన్ ఇండియా ప్లాన్ చేస్తున్నాడ‌ట‌..!

Ram: ఈ మధ్య మన హీరోల చూపు అంతా పాన్ ఇండియన్ మార్కెట్ పైనే ఉంది. ఒకప్పుడు తెలుగుతో పాటు తమిళంలో మార్కెట్ వస్తే చాలు అనుకునే వాళ్లు. కానీ బాహుబలి తర్వాత ఆలోచనలు, ప్రణాళికలు అన్నీ మారిపోయాయి. ఇప్పుడు అందరూ హిందీపై కూడా ఫోకస్ చేస్తున్నారు. అక్కడా ఇక్కడా జెండా పాతాలని చూస్తున్నారు.

సౌత్ ఇండస్ట్రీ వరకు మాత్రమే వసూలు చేస్తే సరిపోయేలా కనిపించడం లేదు. ఇక్కడితో సంతృప్తి చెందడం లేదు కూడా. అందుకే పాన్ ఇండియన్ కథల వైపు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. ఆయనతో పాటు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే ప్లాన్ లో ఉన్నారు. ఇప్పుడు రామ్ పోతినేని కూడా ఇదే చేయాలని చూస్తున్నాడు. ఈయన కూడా పూర్తిగా పాన్ ఇండియన్ కథలకు సై అంటున్నాడు.

నిన్న మొన్నటి వరకు తెలుగు దర్శకులకు మాత్రమే ఛాన్స్ ఇచ్చిన ఈయన.. ఇప్పుడు కాస్త రేంజ్ పెంచుతున్నాడు. తమిళ దర్శకులను పెద్దగా నమ్మే అలవాటు లేని రామ్.. వరసగా వాళ్లకే అవకాశాలు ఇస్తున్నాడు. తద్వారా తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు.

ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ విడుదల కానుంది. మరోవైపు ఈ చిత్రం తర్వాత మురుగదాస్ తోనూ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. మురుగదాస్ కు ఇప్పుడు పెద్దగా హిట్స్ లేవు కానీ ఆయన కానీ సరైన సినిమా చేస్తే పాన్ ఇండియన్ స్థాయిలో పిచ్చెక్కించడం ఖాయం.

అందుకే ఈ ఇద్దరు దర్శకులతో పని చేయడానికి సిద్ధమవుతున్నాడు రామ్. ఈ రెండు సినిమాలతోనే తన మార్కెట్ తో పాటు ఇమేజ్ కూడా పెరుగుతుందని బలంగా నమ్ముతున్నాడు రామ్. మరి చూడాలిక.. ఏం జరుగుతుందో..? కాగా , ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం నుండి రామ్ సినిమాల‌పై విప‌రీత‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. ద‌ర్శ‌క నిర్మాత‌లు సైతం అత‌నితో సినిమాలు చేసేందుకు క్యూలు క‌డుతున్నారు.