Rajamouli: పునీత్ ఇంటికి వెళ్లిన రాజమౌళి.. ఆయన చనిపోయాక ఆ విషయం తెలిసిందన్న జక్కన్న
Tech Sai Chandu - November 27, 2021 / 04:18 PM IST

Rajamouli: ఎస్ఎస్ రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి, ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాత డీవీవీ. దానయ్య శుక్రవారం మద్యాహ్నం ప్రత్యేక విమానంలో బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టు చేరుకున్నారు. హెచ్ఏఎల్ విమానాశ్రయం నుంచి నేరుగా యశవంతపురంలోని ఓరియన్ మాల్ చేరుకున్న ఎస్ఎస్ రాజమౌళి కేవలం అర్దగంట మాత్రమే ఆయన సన్నిహితులతో మాట్లాడారు.
కన్నడలోనే మాట్లాడిన రాజమౌళి బెంగళూరులోని యశవంతపురంలోని ఓరియన్ మాల్ లో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా జనని కన్నడ పాటను ఎస్ఎస్ రాజమౌళి విడుదల చేశారు. ఈ సందర్బంగా కన్నడలోనే మాట్లాడిన ఎస్ఎస్ రాజమౌళి కన్నడ బాష మీద అభిమానాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు.తనకు కన్నడ అంత బాగారాదని, దయచేసి అపార్థం చేసుకోకూడదని ఎస్ఎస్ రాజమౌళి అన్నారు.
బెంగళూరులోని హోటల్ లో జనని కన్నడ పాట విడుదల సందర్బంగా ఓరియన్ మాల్ లోని పీవీఆర్ లోని మల్లీఫ్లెక్స్ థియేటర్ కిక్కిరిసోయింది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ మీడియా మిత్రులు అనేక ప్రశ్నలు వేసి ఎస్ఎస్ రాజమౌళి నుంచి సమాధానాలు రాబట్టాలని ప్రయత్నించారు. త్వరలో వాటికి సమాధానం ఇస్తా అని ఆయన తప్పించుకున్నారు.
బెంగళూరుకు చేరుకున్న ఆయన పునీత్ ఇంటికి వెళ్లారు. పునీత్ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పునీత్ మరణాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు.‘‘నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. నాలుగేళ్ల క్రితం బెంగళూరుకు వచ్చినప్పుడు పునీత్‌ని కలిశాను. నన్ను ఒక కుటుంబసభ్యుడిలా చూసుకున్నారు. ఎంతో సరదాగా మాట్లాడారు.
ఒక స్టార్‌తో మాట్లాడుతున్నాననే భావనే నాకు కలగలేదు. అలాంటిది పునీత్ మరణ వార్త విని ఎంతో షాక్ అయ్యాను. ఆయన మన మధ్య లేరంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆయన ఎంతోమందికి సాయం చేశారని మరణం తర్వాతే అందరికీ తెలిసింది. సాధారణంగా మనం ఓ చిన్న సాయం చేసినా ప్రపంచానికి తెలియాలనుకుంటాం. కానీ పునీత్ అలా కాదు. తను ఎంతో మందికి సాయం చేసినా ఎవరికీ చెప్పలేదు’’ అని రాజమౌళి అన్నారు.