Bharath Jodo Yatra : రాహుల్ జోడో యాత్ర ముగింపు.. కాంగ్రెస్ లో జోరు పెరిగిందా?
NQ Staff - January 30, 2023 / 08:17 PM IST

Bharath Jodo Yatra : కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ 5 నెలల సుదీర్ఘ భారత్ జోడో పాదయాత్ర ముగిసింది. దాదాపు 4000 కిలోమీటర్ల పాటు జోడో యాత్ర కొనసాగింది. దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకు రావడం కోసం రాహుల్ గాంధీ ఈ పాదయాత్ర చేసినట్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పేర్కొన్నారు.
హస్తం శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి, రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాహుల్ గాంధీ యాత్ర కొనసాగింది. ఐదు నెలల రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాశ్మీర్ లో ఘనంగా ముగిసింది. ఇప్పటి వరకు దేశంలో సాగిన రాహుల్ జోడో యాత్ర ఎంత వరకు కాంగ్రెస్ పార్టీకి లాభాన్ని చేకూర్చింది? కాంగ్రెస్ నాయకత్వంలో ఎంత వరకు జోరు పెంచింది అనే ప్రశ్నలకు ప్రస్తుతానికి సమాధానం లేదనే చెప్పాలి.
తెలంగాణ మరియు ఏపీలో చూసుకుంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏమాత్రం ప్రభావం చూపించిన దాఖలాలు కనిపించడం లేదంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో పార్టీ కనీసం బలమైన అభ్యర్థులను ఎంపిక చేసినట్లుగా కూడా బలపడిన దాఖలాలు కనిపించడం లేదంటున్నారు.
మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుల కుమ్ములాటల కారణంగా ఎప్పటికప్పుడు బలహీన పడుతూనే ఉందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కష్టపడి చేసిన భారత్ జోడో యాత్ర ఏ మేరకు ఫలితాన్ని సాధించింది అనేది రాబోయే రోజుల్లో ఉత్తర భారతంలో జరగబోయే ఎన్నికల ఫలితాలను బట్టి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.