Raghu Rama Raju: ఎంపీ రఘురామకృష్ణరాజుకు జగన్ సర్కార్ ‘బర్త్ డే’ గిఫ్ట్..

Raghu Rama Raju: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు ఇవాళ శుక్రవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారనే అభియోగాన్ని మోపారు. హైదరాబాదులో అరెస్టు చేసిన రఘురామకృష్ణరాజును విజయవాడకు తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఐపీసీ సెక్షన్ 124ఏ కింద నాన్ బెయిలబుల్ కేసు, కుట్ర(120బీ), విద్వేష వ్యాఖ్యలు(153ఏ), వ్యక్తిగత దూషణ(505) వంటి అభియోగాలతో కేసులు బుక్ అయినట్లు చెబుతున్నారు. రఘురామకృష్ణరాజు భార్య రమాదేవి పేరితో నోటీసులు ఇచ్చారు. ఈ ఘటనపై ఎంపీ కుమారుడు భరత్ ఆగ్రహంగా స్పందించాడు. తండ్రి మాదిరిగానే అతను కూడా పోలీసుల పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

అధికారులా.. రౌడీలా..

తన తండ్రిని ముందస్తు వారెంట్ లేకుండా అరెస్టు చేశారని భరత్ ఆరోపించాడు. అసలు తమ ఇంటికి వచ్చింది ఆఫీసర్లా లేక రౌడీలా అని ఘాటుగా ప్రశ్నించాడు. అదుపులోకి తీసుకోవటానికి దారితీసిన కారణాలేంటని అడిగితే అవన్నీ కోర్టులో చూసుకోండి అంటూ దురుసుగా సమాధానం చెప్పారన్నాడు. తన తండ్రిని ఎక్కడికి తీసుకెళుతున్నారో కూడా తెలియట్లేదని, అధికారం ఉంది కదా అని ఏమైనా చేస్తారా అంటూ భరత్ నిలదీశాడు. ప్రస్తుతం కొవిడ్-19 వైరస్ వ్యాప్తి భయంకరంగా ఉందని, ఇలాంటి సమయంలో ఒక ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారని సూటిగా అడిగాడు. తన తండ్రికి ఆరోగ్యం సరిగా లేదని, అయినప్పటికీ ఒక పథకం ప్రకారం ఇలా చేస్తున్నారని ఆరోపించాడు. న్యాయస్థానానికి వెళతామని హెచ్చరించాడు. ఇవాళ రఘురామకృష్ణరాజు పుట్టినరోజుని అంటున్నారు.


మరి, వీటికేమంటావ్?..

రఘురామకృష్ణరాజు ఒక ఎంపీ. కరెక్టే. కానీ దేశంలోనే అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అరే.. ఒరే.. అనటం సరైందేనా?. ఆయన సలహాదారుల పట్ల వల్గర్ లాంగ్వేజ్ వాడితే ఓకేనా?. రోజూ విమర్శించటమే పనిగా పెట్టుకుంటే ఊరుకోవచ్చా?. ప్రభుత్వాన్ని ప్రజల్లో బద్నాం చేస్తే సహించొచ్చా?. ఏ పార్టీ టికెట్ మీదైతే గెలిచాడో అదే పార్టీ గుర్తింపును రద్దు చేయాలంటూ ఎన్నికల సంఘంలో ఫిర్యాదు చేయటం నైతికంగా సబబేనా? అంటూ పలువురు రఘురామకృష్ణరాజు కొడుకు భరత్ ని ప్రశ్నిస్తున్నారు. రచ్చబండ సాక్షిగా రెచ్చిపోతున్న రఘురామకృష్ణరాజుకు జగన్ సర్కారు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిందని కూడా సెటైర్లు వేసుకుంటున్నారు.