R.P.Patnaik: రాజుని ప‌ట్టిస్తే తాను ప‌ర్స‌న‌ల్‌గా రివార్డ్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించిన మ్యూజిక్ డైరెక్ట‌ర్

R.P.Patnaik: సైదాబాద్‌లో ఆరేళ్ల బాలికపై అత్యాచరం, హత్య ఘటనలో నిందితుడ్ని పట్టించిన వారికి రూ.10లక్షలు రివార్డు ఇస్తామని పోలీసులు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ‘నిందితుడి ఆచూకీ తెలిసిన వారు 94906 16366 నంబరుకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.ఈ కేసులో పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి నాలుగు రోజులుగా నిందితుడి కోసం గాలిస్తున్నాయి. అయినా, నిందితుడు రాజు ఆచూకీ తెలియలేదు.

నిందితుడిని ఎలా ప‌ట్టుకుతీర‌తామ‌ని పోలీసులు చెబుతున్నారు. మొబైల్ కూడా అత‌ని ద‌గ్గ‌ర లేక‌పోవ‌డంతో ప‌ట్టుకోవ‌డం కాస్త క‌ష్టంగా మారింది. పోలీసులు నిందితుడికి సంబంధించి కొన్ని ఆన‌వాళ్లు ప్ర‌క‌టించారు. అత‌ని వ‌య‌స్సు 30 సంవ‌త్సరాలు ఉంటుంద‌ని, 5.9 అడుగుల ఎత్తు, టోపీ పెట్టుకొని ఎర్ర చేతిరుమాల ముఖానికి పెట్టుకుంటాడ‌ని, రెండు చేతులపైనా మౌనిక అని పచ్చబొట్టు వేయించుకున్నాడు. అతడికి మద్యం సేవించే అలవాటు ఉంది. మద్యం మత్తులో ఫుట్‌పాత్‌పై ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతాడు’’అని చెప్పారు.

సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం నిందితుడిని ప‌ట్టుకోవాల‌ని అత‌డిని క‌ఠినంగా శిక్షించాల‌ని నినాదాలు చేస్తున్నారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ సైతం సైదాబాద్‌ ఘటనపై స్పందిస్తూ.. నిందితుడి ఆచూకీ తెలియజేస్తే రివార్డు ఇస్తానని ప్రకటించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తేనే చిన్నారి ఆత్మకు శాంతి చేకూరుతుందంటూ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేశారు.

చిట్టితల్లికి న్యాయం జరగాలంటే, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటే నిందితుడు రాజు దొరకాలి. అతడి ఆచూకీ తెలియజేసిన వారికి రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని హైదరాబాద్‌ పోలీసులు ప్రకటించారు. పట్టించిన వారికి నా వంతుగా రూ.50 వేలు ఇస్తాను. అతడు దొరకాలి. చేతిపై ‘మౌనిక’ అనే పచ్చబొట్టు తప్పకుండా అతడిని పట్టించేలా చేస్తుంది. అతడు మీ దగ్గర్లోనే ఉండొచ్చు. ఒక కన్ను వేసి ఉంచండి. ఆ కిరాతకుడిని పట్టుకునే పనిలో పోలీసు శాఖకు మన వంతు సాయం అందిద్దాం’ అని ఆయన పిలుపునిచ్చారు.