PV Sindhu: ఊరించి ఉసూరుమ‌నిపించిన పీవీ సింధు.. సెమీస్‌లో చిత్తుగా ఓట‌మి

PV Sindhu: టోక్యో ఒలంపిక్స్‌లో భార‌త్ త‌ర‌పున తెలుగు తేజం పీవీ సింధు స్వ‌ర్ణ ప‌తకం తీసుకు వ‌స్తుంద‌ని అంద‌రు ఊహించారు. కాని అంద‌రి ఆశ‌ల‌ని ఆమె అడియాశ‌లు చేసింది. అన్ని మ్యాచ్‌ల‌లో హ‌వా చూపించిన పీవీ సింధు సెమీస్‌లో తేలిపోయింది. సెమీ ఫైనల్‌లో చైనీస్ ప్లేయర్ తై జూ యంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-18, 21-12 తేడాతో వరుస సెట్లలో ఓడిన పీవీ సింధు, కాంస్య పతకం కోసం జరిగే పోరులో ఆడనుంది.

మొద‌టి సెట్ ఫ‌స్ట్ హాఫ్‌లో 11-8 తేడాతో ఆధిక్యంలో నిలిచిన పీవీ సింధు, ఆ తర్వాత తై జూ జోరు ముందు నిలవలేకపోయింది. సెకండ్ హాఫ్‌లో 16-16, 17-17 తేడాతో సమంగా నిలవడంతో ఉత్కంఠ రేగింది. త‌ర్వాత వ‌రుస పాయింట్ సాధించిన తై జూ 21-18 తేడాతో తొలి సెట్ గెలుచుకుంది.

పీవీ సింధు, తై జు యింగ్ ఇప్పటి వరకూ 19 సార్లు తలపడగా.. ఇందులో ఏకంగా 14 సార్లు పీవీ సింధుని తైజు ఓడించడం గమనార్హం. కాంస్య పతకం కోసం చైనా షట్లర్ హి బింగ్జియావోతో పీవీ సింధు ఆదివారం సాయంత్రం తలపడనుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో ఫైనల్‌కి చేరిన పీవీ సింధు రజత పతకం గెలుపొందిన విషయం తెలిసిందే.

‘‘సెమీ ఫైనల్‌లో ఓడినందుకు పీవీ సింధు స్పందిస్తూ నాకు బాధగానే ఉంది. చివరికంటా నా శక్తిమేరకు పోరాడాను. కానీ ఈరోజు నాది కాకుండా పోయింది’’ అని భారత షట్లర్‌ పీవీ సింధు పేర్కొంది. బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ వర్గాలతో సింధు మాట్లాడుతూ… ‘‘తన బలబలాను అంచనా వేసే బరిలోకి దిగాను. కానీ తను నాపై పైచేయి సాధించింది. సెమీస్‌లో పాయింట్లు సాధించడం అంత తేలికేమీ కాదు. కాకపోతే విజయం నా చేజారింది’’ అని తెలిపింది.

త‌న పోరాటం ఇంకా ముగియ‌లేదు అని చెప్పిన సింధు కాంస్య ప‌త‌కం కోసం పోరాడ‌నుంది. త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన భార‌తీయ‌లుకు సింధు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది. అయితే టోక్యో ఒలింపిక్స్‌లో శనివారం భారత జట్టుకి పెద్దగా కలిసి రాలేదు. భారత మహిళా హాకీ జట్టు, సౌతాఫ్రికాతో జరిగిన పూల్ మ్యాచ్‌లో విజయం సాధించినా.. భారత స్టార్ బాక్సర్ అమిత్ పంగల్ తొలి మ్యాచ్‌లోనే ఓటమి చెందాడు.., ఒలింపిక్ మెడల్ తెస్తుందని ఆశపడిన పూజారాణి క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిపోయింది.