Kavitha – YS Avinash Reddy : కవిత, అవినాష్ ఇష్యూలతో ఒక్కసారిగా వేడెక్కిన తెలుగు రాష్ట్రాల రాజకీయం
NQ Staff - March 10, 2023 / 10:34 PM IST

Kavitha – YS Avinash Reddy : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేకుండానే రాజకీయం వేడెక్కింది. ఒక వైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత ఈడీ విచారణకు హాజరు అవ్వనుండటంతో పాటు ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె అభిమానులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేయడంతో పాటు ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.
కవితకు మద్దతుగా సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు షేర్ చేస్తూ మేమున్నాం అంటూ అభిమానులు మరియు కార్యకర్తలు మద్దతుగా నిలుస్తున్నారు. కవిత అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఢిల్లీ చేరుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కవిత విషయమై బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మరియు ఇతర పార్టీల నాయకులు చర్చించుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను అరెస్ట్ చేస్తారంటూ స్వయంగా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. కవితను అరెస్ట్ చేస్తే రాజకీయంగా మైలేజ్ సొంతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ అండ్ టీం ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మంతనాలు…
ఇదే సమయంలో బీజేపీ నాయకులు కూడా ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తున్నారట. కవిత అరెస్ట్ అయితే ఎలా స్పందించాలనే విషయమై కాంగ్రెస్ నాయకులు కూడా చర్చలు జరుపుతున్నారట. మొత్తానికి కవిత అరెస్ట్ కు సంబంధించి తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరో వైపు ఏపీలో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. రాజకీయ కుట్ర అంటూ కొందరు ఈ విషమై విమర్శిస్తున్నారు.
వివేకా హత్య కేసులో సీబీఐ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే తెలుగు దేశం పార్టీ రాజకీయంగా మైలేజ్ సొంతం చేసుకునే విధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు అవినాష్ రెడ్డి ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డితో జరగబోతున్న పరిణామాల గురించి మాట్లాడటం.. ఆ తర్వాత అనుసరించాల్సిన విధానం గురించి చర్చించారని తెలుస్తోంది.
మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఒక వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ అరెస్ట్ కాబోతుందనే ప్రచారం.. మరో వైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆప్తుడు అయిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ లకు సంబంధించిన చర్చలతో రాజకీయం వేడెక్కింది. ఒకటి రెండు రోజుల్లో మరింతగా ఈ రాజకీయం పతాక స్థాయికి చేరే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.