Politics : అన్ని రాజకీయ పార్టీలూ ఇలాగే చేస్తే ఎంత బాగుంటుందో?..
Kondala Rao - May 4, 2021 / 05:10 PM IST

Politics: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) తెలంగాణ శాఖ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకీ ఆదర్శంగా నిలిచే పని చేసింది. కరోనా లక్షణాలు ఉన్నవారి కోసం, పాజిటివ్ నిర్ధారణ అయినవారికోసం పార్టీ ఆధ్వర్యంలో ఐసోలేషన్ కేంద్రాన్ని నిన్న సోమవారం ప్రారంభించింది. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 20 పడకలతో ఏర్పాటుచేసింది. ఈ సెంటర్ ని సీపీఎం పొలిట్ బ్యూరో మెంబర్ బీవీ రాఘవులు రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి ఆరంభించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ దేశంలో కొవిడ్-19 వైరస్ తీవ్రంగా వ్యాపిస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. నివారణ చర్యలను చేపట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయని విమర్శించారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సరిపోను సంఖ్యలో ఐసోలేషన్ కేంద్రాలు, బెడ్లు, టీకాలు, కిట్లు లేకపోవటంతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు.
నిరుపేదల కోసం..
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా మహమ్మారి నియంత్రణకు సరైన చర్యలు చేపట్టకపోవటం వల్లే బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని తమ్మినేని వీరభద్రం తప్పుపట్టారు. పార్టీ తరఫున ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలను అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీజీ నరసింహారావు కూడా పాల్గొన్నారు. పార్టీ ఆఫీసుల్లో కొవిడ్ ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటుచేయాలని సీపీఎం 5 రోజుల కిందటే నిర్ణయించింది. ఇప్పుడు అమలుచేసింది. ఒకే గదిలో కాలం వెళ్లదీసే నిరుపేదల కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి కుటుంబాల్లో ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే ఇతర సభ్యులు ఇబ్బందిపడకూడదనే ఉద్దేశంతో పార్టీ ఆధ్వర్యంలో ఐసోలేషన్ కేంద్రాలని అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్ తోపాటు జిల్లాలు, మండలాలు, గ్రామాల వరకు కొవిడ్ హెల్ప్ లైన్లను, వైద్య సహాయాన్ని, భోజన కేంద్రాలను కూడా ప్రారంభిస్తామని చెప్పారు.
వీహెచ్ చెప్పినా వినలే..
నిజానికి ఈ ఆలోచన ముందుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు(వీహెచ్)కి వచ్చింది. హస్తం పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ తోపాటు జిల్లాల్లోని ఆఫీసులను మూడు నెలల పాటు కొవిడ్ కేంద్రాలుగా మారుస్తామనే ప్రతిపాదనను ప్రభుత్వం ముందు పెట్టాలంటూ ఆయన తమ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కి లెటర్ రాశారు. కానీ ఇంతవరకూ అటు నుంచి స్పందన రాలేదు. ఈ లోపు సీపీఎం అమలుచేసింది. అన్ని పొలిటికల్ పార్టీలూ ఇదే బాటలో నడిస్తే ఎంత బాగుంటుందో.