PM Modi: ప్రధాని మోడీ వల్ల ఎంతో మందికి కరోనా సోకింది

PM Modi: కరోనా వైరస్ వల్ల దేశంలో ప్రస్తుతం ఈ దుస్థితి నెలకొనటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే ప్రధాన కారణమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నవ్ జ్యోత్ దహియా ఆరోపించాడు. మోడీ కొవిడ్-19 సూపర్ స్ప్రెడర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కరోనా నిబంధనలను పాటించాలంటూ తాము ఒక వైపు దేశ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటే ప్రధాని దానికి వ్యతిరేకంగా వ్యవహరించారని విమర్శించాడు. కొవిడ్-19 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఉల్లంఘించి మోడీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో ర్యాలీల్లో, మీటింగుల్లో పాల్గొన్నారని దహియా తప్పుపట్టారు.

ఆక్సీజన్ కొరతకూ..

దేశంలో కరోనా సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసి కూడా ఎలక్షన్ ప్రచారాలకు, హరిద్వార్ లో కుంభమేళాకి అనుమతివ్వటం సరికాదని దహియా తేల్చిచెప్పారు. వీటి వల్లే కొవిడ్ వ్యాప్తి పెరిగి మరణాలు సంభవిస్తున్నాయని, హాస్పిటల్స్ కి అంబులెన్స్ ల తాకిడి ఎక్కువైందని మండిపడ్డారు. దేశంలో ఇప్పుడు ప్రాణ వాయువు కొరత ఇంతలా ఏర్పడటానికి కూడా ప్రధాని మోడీయే ముఖ్య బాధ్యుడని ఐఎంఏ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది రోగులు చనిపోతుండటానికి మెడికల్ ఆక్సీజన్ లేకపోవటమే కారణమని తెలిపారు. దేశంలో ఎక్కువ ప్రదేశాల్లో ఆక్సీజన్ ప్లాంట్లను ఏర్పాటుచేసే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం వద్దే అనుమతులు పెండింగులో ఉన్నాయని పట్టిచూపారు.

ట్రంప్ కి ఆ స్వాగతం అవసరమా

డాక్టర్ నవ్ జ్యోత్ దహియా ప్రధాని మోడీపై మొన్న సోమవారం ఈ స్థాయిలో విరుచుకుపడటం సంచలనం రేపుతోంది. ఆయన మరో ముఖ్యాంశాన్ని కూడా గుర్తు చేశారు. ‘‘మన దేశంలో తొలి కరోనా రోగిని పోయినేడాది జనవరిలో గుర్తించాం. అప్పుడే సరైన చర్యలు చేపట్టి ఉంటే ఈ స్థాయిలో వ్యాప్తి జరిగేది కాదు. కానీ మోడీ ఏం చేశారు?. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఘన స్వాగతం పలకటం కోసం గుజరాత్ లో లక్ష మందికి పైగా సమీకరించారు. దీంతో ఆ మహమ్మారికి పట్టపగ్గాల్లేకుండా పోయింది. ఇది జరిగి ఏడాది అవుతున్నా, సెకండ్ వేవ్ మొదలైనా పరిస్థితిని చక్కదిద్దటానికి ప్రధాని మోడీ చేసిందేమీ లేదు’’ అని ఐఎంఏ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నవ్ జ్యోత్ దహియా కుండబద్ధలు కొట్టారు.

 

Advertisement