PM Modi: తెలుగు రాష్ట్రాలను.. తప్పుపట్టిన మోడీ

PM Modi దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని అరికట్టడానికి చేపట్టాల్సిన చర్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ బుధవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలతోపాటు కొవిడ్-19 వ్యాక్సిన్ వేస్టేజ్ గురించి కూడా ప్రస్తావించారు. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు యూపీ(ఉత్తరప్రదేశ్)ని సైతం తప్పుపట్టారు. ఈ మూడు రాష్ట్రాల్లో టీకా 10 శాతం కన్నా ఎక్కువ వృథా అవుతోందంటూ ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ వేస్టేజ్ పై సమీక్ష జరపాలని సూచించారు. అసలు ఎందుకు ఇలా జరుగుతోందో ప్రతి రోజూ పర్యవేక్షణ జరపాలని, వృథాను జీరో లెవల్ కి తీసుకురావాలని ఆదేశించారు.

ఆత్మ విశ్వాసం.. అతి విశ్వాసం కావొద్దు..

‘‘కరోనా విషయంలో దేశ ప్రజలందరూ మరోసారి అలర్టుగా ఉండాలి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు జనాన్ని భయభ్రాంతులకు గురిచేయొద్దు. అవసరమైన చోట్ల మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటుచేయాలి. కొన్ని ప్రాంతాల్లో కరోనా టెస్టులు తక్కువగా జరుగుతున్నాయి. ఎందుకిలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలియట్లేదు. ముందు జాగ్రత్తతో, ధైర్యంగా, ఆత్మవిశ్వాసం చూపుదాం. అంతేతప్ప అతి విశ్వాసం పనికిరాదు. కొవిడ్-19 మాకు రాదులే అనే ధీమా ప్రదర్శించొద్దు. గతంలో కరోనా పెద్దగా కనిపించని 70 జిల్లాల్లోనే ఇప్పుడు ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి నియంత్రణ చర్యలు పాటిస్తూ ఆ మహమ్మారిని కంట్రోల్ చేద్దాం’’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

ఇద్దరు సీఎంలు ఆబ్సెంట్.. 

కొవిడ్-19 సెకండ్ వేవ్ పై ప్రధాని ఈ రోజు నిర్వహించిన మీటింగుకి ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భగేల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరు కాలేదు. మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నరు కాబట్టి భేటీకి రాలేదని అనుకోవచ్చు. కానీ భూపేష్ ఎందుకు ఆబ్సెంట్ అయ్యారో తెలియదు. కరోనా విషయంలో ప్రధాని మోడీ రెగ్యులర్ గా సీఎంలతో మాట్లాడుతున్నారు. గతేడాది ఒకసారి, టీకా ప్రారంభానికి ముందు ఒకసారి, ఇప్పుడు మూడోసారి ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. దేశంలో రీసెంటుగా నమోదవుతున్న కేసుల్లో 80 శాతానికి పైగా కేసులు ఆరు రాష్ట్రాల్లో రిజిస్టర్ అవుతున్నాయి. అవి మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్ అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement